నిర్భయ తల్లిపై కారుకూతలు కూసిన మాజీ డీజీపీ - MicTv.in - Telugu News
mictv telugu

నిర్భయ తల్లిపై కారుకూతలు కూసిన మాజీ డీజీపీ

March 15, 2018

చెట్టంత ఎదిగిన కూతురిని పోగొట్టుకున్న ఆ తల్లి ఆవేదన ఇంకా తీరనేలేదు. మదమెక్కిన మృగాళ్ళ దాడిలో తన కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లింది. ఆ అమ్మ కడుపుకోతను మరింత సలిపాడు ఓ ప్రబుద్ధుడు. నిర్భయ తల్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కర్ణాటక మాజీ డీజీపీ సంగ్లియానా వివాదంలో చిక్కుకున్నాడు. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జరిగిన నిర్భయ ఉదంతం గురించి తెలిసిందే. ఆ ఒక్క ఉదంతం దేశ చట్టాలను మరింత పటిష్టం చేసిందనే చెప్పుకోవచ్చు.తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై బాధితురాలి తల్లి ఆశాదేవి న్యాయస్థానాల్లో అలుపెరుగని పోరాటం చేశారు. ఆమెతో పాటు మరికొందరి సేవలను గుర్తిస్తూ బెంగళూరులో అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సంగ్లియానా ముఖ్య అతిథిగా పాల్గొని అవార్డులను బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ నిర్భయ తల్లి ఆశాదేవి చక్కని శరీరాకృతిలో వుంది. తల్లి ఇంత అందంగా వుంటే ఇంక కూతురు ఎంత అందంగా వుండేదో ఊహించుకుంటున్నాను ’ అని నోరు జారారు.

తరువాత అత్యాచారాలపై స్పందిస్తూ ‘ పోరాడలేనివారు సరెండర్ అవ్వాలి. లేదంటే కేసు వేసుకోవాలి. అలాగైతేనే మనం సురక్షితంగా బయటపడి, ప్రాణాలను కాపాడుకోగలం ’ అనటంతో అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు. దీనిపై బెంగుళూరు మిర్రర్ ఓ కథనాన్ని ప్రచురించింది.