ఏప్రిల్ ఒకటి నుంచి మాల్స్, మల్టీఫ్లెక్సుల్లో ఉచిత పార్కింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఏప్రిల్ ఒకటి నుంచి మాల్స్, మల్టీఫ్లెక్సుల్లో ఉచిత పార్కింగ్

March 21, 2018

మాల్స్, మల్టీప్లెక్స్‌లకు వెళ్ళేవాళ్ళకు తెలంగాణ సర్కార్ ఓ శుభవార్తను మోసుకొచ్చింది. చాలా ఏళ్ళుగా పార్కింగ్ వసూళ్ళ సమస్య నగరవాసులకు తలనొప్పిగా మారింది. ఆ తలనొప్పిని శాశ్వతంగా పాలద్రోలడానికి ప్రభుత్వం పూనుకుంది. ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తూ జీవో జారీ చేసింది. ఏ చిన్నపని కోసం లోపలికి వెళ్ళి బయటికొచ్చినా అతనికి పార్కింగ్ బిల్లు చెల్లించాల్సిందే. గంటల లెక్కన వాళ్ళు దండుకుంటున్న దోపిడీకి ఇక శాశ్వత మూత పడ్డట్టే. పార్కింగ్ ఛార్జీల వసూలు చట్టవిరుద్ధమే అయినా.. అందుకు సంబంధించిన రూల్స్ పక్కాగా లేకపోవటంతో అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వ యంత్రాంగం వుంది.ఇలాంటి పార్కింగ్ బాదుళ్ళకు మంగళం పాడే దిశలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక జీవోను జారీ చేసింది. పురపాలక శాఖ జారీ చేసిన జీవో నెంబరు187 ప్రకారం ఏప్రిల్ ఒకటి నుంచి మాల్స్, మల్టీఫ్లెక్సుల్లో ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కొన్ని షరతులతో కూడిన ఈ జీవోను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు.. తెలంగాణలోని ఇతర పట్టణాల్లోని మాల్స్, మల్టీఫ్లెక్సుల్లో ఈ రూల్స్ వర్తిస్తాయి.

షరతులు :

– 30 నిమిషాల నుంచి గంట వరకు మాల్స్‌లో ఏదైనా షాపింగ్ చేసి రశీదు చూపిస్తే పార్కింగ్ ఫ్రీ.

–  వస్తువులు కొన్నా కొనకున్నా.. 30 నిమిషాల లోపు పార్కింగ్‌కు ఎలాంటి రుసుము వసూలు చేయకూడదు.

– గంట కంటే ఎక్కువ టైం పార్కింగ్ చేస్తే.. పార్కింగ్ రుసుము కంటే ఎక్కువ మొత్తంలో బిల్లు అమౌంట్ కానీ.. సినిమా టికెట్ కానీ చూపిస్తే.. వారి నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేయరు.

తాజా జీవో ప్రకారం రూల్స్‌ను అమలు చేయని మాల్స్.. మల్టీఫ్లెక్సులపై జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.