నగరాల్లో 70 కి.మీ వేగంతో దూసుకుపోవచ్చు..! - MicTv.in - Telugu News
mictv telugu

నగరాల్లో 70 కి.మీ వేగంతో దూసుకుపోవచ్చు..!

March 15, 2018

నగరం రహదారులపై వాహనాలు మరింత వేగంగా దూసుకుపోనున్నాయి. గంటకు 70 కిలోమీటర్ల స్పీడుతో వెళ్లడానికి కేంద్రం అనుమతించింది.  రవాణ మంత్రిత్య శాఖ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. టూవీలర్లు అయితే గంటకు 50 కిలోమీటర్లు, రవాణా వాహనాలు అయితే 60 కి.మీ. వేగంతో వెళ్ళవచ్చని వెల్లడించింది. ఎక్స్‌ప్రెస్‌వేలపై గంటకు 120 కి.మీ. వేగంతో వెళ్లేందుకు అనుమతించినట్టు కేంద్ర రవాణ శాఖ సంయుక్త కార్యదర్శి అభయ్ దామ్లే పేర్కొన్నారు.  ప్రస్తుతం నగరాల్లో వాహనాల వేగ పరిమితి 40 నుంచి 50 కిలోమీటర్ల మధ్య ఉంది. దేశవ్యాప్తంగా మెరుగైన రహదారులు ఏర్పడటం, రింగ్‌రోడ్లు, ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణం సాగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, స్థానికంగా ఉండే రహదారుల నాణ్యత, భద్రతలను దృష్టిలో ఉంచుకుని వేగ పరిమితిని తగ్గించుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నామని పేర్కొన్నారు. అధికారులు తయారు చేసిన ప్రతిపాదనలకు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదించినట్టు వెల్లడించారు.