mictv telugu

‘సౌతిండియా దావూద్’ ఆత్మహత్య

October 5, 2017

జనాలను గడగడలాడించే దాదాలు కూడా పిరికివాళ్ళలా సూసైడ్ చేసుకుంటారా ? పరిస్థితులు తనకన్నా పెద్ద డాన్ అయినప్పుడు తోక ముడచక తప్పదేమో.. తాజాగా సౌతిండియా దావూద్‌గా పాపులర్ అయిన గ్యాంగ్ స్టర్ శ్రీధర్ ధనపాలన్ (44) కంబోడియాలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం సైనైడ్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఇరుగు, పొరుగువారు వెంటనే సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన ప్రాణాలు పోయినట్టు వైద్యులు ప్రకటించారు. కుటుంబ కలహాల కారణంగానే శ్రీధర్ ధనపాలన్ ఈ పనికి పాల్పడ్డట్టు తెలుస్తోంది..

పోలీసులకు చిక్కకుండా వారి కన్నుగప్పి 2013లో శ్రీధర్ ఇండియా నుంచి పారిపోయాడు. పోలీసులు అతని జాడను కనిపెట్టలేకపోయారు. కంబోడియాలో ఒంటరిగానే ఉంటున్నట్టు తెలుస్తోంది. అతనికి భార్యా, ఇద్దరు కుమారులు కాంచీపురంలోనే ఉండగా, కుమారుడు లండన్‌లో చదువుకుంటున్నాడు.

అతని నేర చరిత్రలో ఎన్నో నెత్తుటి మరకలు, తమిళనాడు పోలీసులకు శ్రీధర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. లెక్కలేనన్ని కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నాడు. శ్రీధర్ ధనపాలన్ మరణ వార్త తెలిసిన తరువాత, ఆయన ఇల్లు ఉన్న కాంచీపురంలోని ఎల్లియప్పన్ వీధిలో ఉద్రిక్తత నెలకొంది. శ్రీధర్‌పై ఏడు హత్య కేసులు సహా మొత్తం 43 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.