3 నెలల ఎడబాటు.. ఉప్పొంగిన ప్రేమ  - MicTv.in - Telugu News
mictv telugu

3 నెలల ఎడబాటు.. ఉప్పొంగిన ప్రేమ 

October 24, 2017

కుక్క.. విశ్వాసానికి మారు పేరు అంటారు. తిండి పెట్టి, లాలించిన వారిని అది ఎన్నటికీ మరిచిపోదు. జర్మనీకి చెందిన ఓ కుక్క దీనికి తాజా ఉదాహరణ. మూడు నెలల కిందట చోరీకి గురైన ఈ శునకం.. చివరికి తన యజమానుల చెెంతకు చేరింది. వారిని చప్పున గుర్తించి, ఉద్వేగంతో కుయ్ కుయ్.. అని గారాలు పోయింది. ఇప్పుడా వీడియో వైరల్ అయింది.

జర్మనీకి చెందిన  స్కరెన్ బర్గ్ , స్టీఫెన్  దంపతులు 2016 నుంచి ప్రపంచ యాత్ర చేస్తున్నారు. వారు జూలైలో చెన్నైకి వచ్చారు. అప్పుడు వారి కుక్క లూక్‌ను దొంగలెవరో ఎత్తుకెళ్లారు. దాని కోసం వారు గాలించినా ఫలితం లేకపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసి నేపాల్‌కు వెళ్లిపోయారు. లూక్ తమ వద్ద వుందని చెన్నైకి జంతుహక్కుల కార్యకర్త విజయ్ నారాయణ్ వారికి ఫోన్ చేశారు. ఆ దంపతులు ఆగ మేఘాలపై ఈ నెల 21న చెన్నైలోని విజయ్ ఇంటికి చేరుకున్నారు.

వారు బూట్లు విప్పుతుండగానే లూక్ భౌభౌ అరుపులు వినిపించాయి. దీంతో ఆ జంట భావోద్వేగంతో కన్నీరు పెట్టుకుంది. లూక్ కూడా సంబరంతో, ఆశ్చర్యంతో  వారిని చుట్టేసి, వారి చుట్టూ తిరుగింది.  ఈ సందర్భంగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. లూక్ నిజానాకి ఓ అనాథ కుక్క . ఈ జర్మన్ దంపతులు గ్రీస్ వెళ్లినప్పుడు దాన్ని దత్తత తీసుకున్నారు.