mictv telugu

ధిక్కార మందారం..  జార్జి ఫెర్నాండెజ్ జీవితం..

January 29, 2019

జార్జి ఫెర్నాండెజ్.. ఒక స్వప్నం, ఒక తిరుగుబాటు! శత్రువులు ఎంతటి వారైనాసరే వారితో దూకుడుగా తలపడి మట్టికరిపించే జెయింట్ కిల్లర్. స్వతంత్ర భారత చరిత్రలో దేశమంతా ప్రభావం చూపిన ఒకే ఒక్క కార్మిక నాయకుడు. పట్టిన పట్టును వదలకుండా అనుకున్నది సాధించిన ధీరుడు. జార్జి ఫెర్నాండెజ్ పేరు నేటి తరానికి పరిచయంగానే తప్ప పూర్తిగా తెలియదు. కానీ 70ల నాటి యువతరానికి ఆయనంటే… అతకంటే ముఖ్యంగా మచ్చలేని  ‘జార్జి ఫెర్నాండెజ్’ అంటే ఏంటో బాగా తెలుసు. అందుకే ఆయన దేశ రాజకీయాల్లో ఒక అలజడి.. విప్లవం.. ధిక్కారం.. ఎగసిన కెరటం.. కానీ ఎగసిన కెరటం తప్పనిసరిగా కింద పడాల్సిందే అన్నట్లు ఆయన కూడా కిందపడిపోయారు. అయినా నిరుడు కురిసిన హిమసమూహాల మాదిరి ఆయన చరిత్రలో ఒక మైలురాయి. ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. చివరకు ఆయన కడపటి వివాదాస్పద రాజకీయాల నుంచి కూడా..

మతబోధన నుంచి..

జార్జి ఫెర్నాండెజ్ కేవలం రాజకీయ నాయకుడే కాదు. ఆయన మంచి వక్త. రచయిత, విలేకరి, రైతు, బాంబుల కుట్రదారు, కార్మికనాయకుడు, రక్షణ మంత్రి, తన బట్టలు తానే ఉతుక్కునే, తనింటి పాత్రలు తానే తోముకునే నిరాడంబర సంసారయోగి.. మరెన్నో. నిత్యం జనంతో, వారి జీవితాల ఆశనిరాశలతో మమేకం కావడం వల్లే ఆయన ఇన్ని రూపాల్లో వికసించారు. ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకుంటూ, జనాన్ని తన వెంటబెట్టుకుని ముందుకు సాగడం ఆయన వ్యక్తిత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది.

జార్జి కర్ణాటకలోని మంగళూరులో కేథలిక్ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లికి బ్రిటిష్ చక్రవర్తి జార్జి అంటే అభిమానం. అందుకే తన ఆరో బిడ్డకు జార్జి అని పేరు పెట్టుకుంది. జార్జి టీనేజ్ వయసులో.. స్కూలును వదిలేసి, మతబోధనలో శిక్షణ తీసుకున్నారు. కానీ ఆ జీవితం రుచించక ముంబై మహానగరానికి వెళ్లారు. నగరం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. మొదట్లో చిన్నాచితకా పనులు చేశారు. తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

సామ్యవాదమే శ్వాస..

కాంగ్రెస్ గాలి వీస్తున్న రోజులవి. నెహ్రూ సంక్షేమం కల్లలైన రోజులవి. అసంతృప్తులు తిరగబడ్డారు. సామ్యవాదం తప్ప మరొకటి దేశాన్ని ముందుకు నడిపించలేదని, ప్రజల కన్నీళ్లు తుడవలేదని భావించారు. జార్జి కూడా సోషలిజంవైపు కదిలారు. కార్మిక సంఘాల్లో ప్రవేశించారు. దేశంలో కార్మికులు ఎక్కడ సమస్యలు ఎదుర్కొంటున్నా అక్కడికి చేరుకుని వారితో సమ్మెలు కట్టించేవారు. హర్తాళ్లు చేయించేవారు. ప్రభుత్వాలను వినతులతోనే కాకుండా హెచ్చరికలతోనూ దారికి తెచ్చుకునేవారు. ఆయన 11 భాషలు మాట్లాడగలరంటే జనంలో ఎంతగా కలసిపోయారో అర్థం చేసుకోవచ్చు.  

జెయింట్ కిల్లర్..

ముంబై స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీతో ఆరంభమైంది ఆయన రాజకీయ ప్రస్థానం. జార్జి 1967లో పార్లమెంటులోకి అడుగుపెట్టారు. దక్షిణ ముంబై నుంచి సంయుక్త సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా తలపడి కాంగ్రెస్ దిగ్గజనేత సదాశివ కానోజీ పాటిల్‌ను  మట్టికరిపించడం నాటి రాజకీయ దిగ్గజాలను, విశ్లేషకులను ఆశ్చర్య చకితులను చేసింది. జెయింట్ కిల్లర్ అని పిలవసాగారు. అప్పటి నుంచి జార్జికి ఎన్నికలు నల్లేరుపై బండనడకలా సాగాయి.

1974 చారిత్రక  రైల్వే సమ్మె

స్వతంత్ర భారతంలో జరిగిన నిర్ణయాత్మక సమ్మెల్లో ఇది ప్రముఖమైనంది. రైల్వే ఉద్యోగుల్లో అంతకు ముందు రెండు దశాబ్దాల నుంచి గూడుకట్టుకుని ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా బద్దలైంది. అఖిల భారత రైల్వే కార్మికుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న జార్జి దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. దేశ జీవనాడులు స్తంభించాయి. చివరకు ట్యాక్సీవాలాలు కూడా సమ్మెకు దిగారు. ఇందిర ప్రభుత్వం కాళ్లబేరానికి దిగొచ్చి కార్మికుల డిమాండ్లకు తలవొగ్గింది. జార్జి పేరు మార్మోగింది. రైల్వే ఉద్యోగులకు తొలిసారిగా ఉత్పత్తి ఆధారిత బోనస్ (Productivity Linked Bonus) సాధించిన ఘనత కూడా ఆయనదే.

ఎమెర్జెన్సీ, అండర్‌గ్రౌండ్, సంకెళ్లు..

Image result for george fernandes

ఇందిరాగాంధీ దేశాన్ని ‘అదుపు’లో పెట్టడానికి  1975లో అత్యయిక పరిస్థితి విధించారు. ఆందోళనకారుల నోళ్లు నొక్కారు. పత్రికలు మూసేయించారు. నిరసనకారులు అండర్ గ్రౌండ్ లోకివెళ్లారు. ప్రభుత్వాన్ని కూలదోయడానికి చేయాల్సిన పనులన్నీ చేశారు. జార్జి కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సిక్కులా తలపాగా ధరించి తిరిగేవారు. రైల్వే పట్టాలను, ప్రభుత్వ ఆస్తులను పేల్చడానికి కుట్రపన్నాడంటూ జార్జితోపాటు 24 మందిని బరోడా డైనమైట్ కుట్ర కేసు పేరుతో  పోలీసులు అరెస్టు చేశారు. ఎమర్జెన్సీ కనుక ఖైదీలు పారిపోకుండా సంకెళ్లు వేశారు. జార్జి ఫెర్నాండెజ్.. ఆ సంకెళ్లను మీడియాకు చూపుతూ మాట్లాడారు. ఆ ఫొటో ఎమెర్జెన్సీకి ఒక ప్రతీక.

కేంద్ర మంత్రిగా.. కోకోకోలా తరిమివేత

Image result for george fernandes

ఎమర్జెన్సీని తొలగించాక జార్జి బిహార్‌లోని ముజఫర్‌పూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికై మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నరనరానా జీర్జించుకున్న సామ్యవాదానికి తోడు దేశవిదేశీ పెట్టుబడుల నిష్పత్తుల విషయంలో వివాదం వల్ల బహుళజాతి కంపెనీలపై కఠిన చర్యలు తీసుకున్నారు. అమెరికాకు చెందిన ఐబీఎం, కోకాకోలా కంపెనీలను తరిమేశారు. తర్వాత జనతా పార్టీతో విభేదాలు ఎదురయ్యాయి. వాజ్ పేయి, అద్వానీ తదితర  మంత్రులు ఆరెస్సెస్‌తో సంబంధాలు వదలుకోవాలని జార్జి కోరేవారు. అందుకు వారు ససేమిరా అనేవారు. మొరార్జీ ప్రభుత్వం కూలిపోయాక 1980లో జరిగిన ఎన్నికల్లో జార్జి మళ్లీ లోక్‌సభకు ఎన్నికై విపక్షంలో కూర్చున్నారు. ఇందిర ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 1989 – 1990 మధ్య వీపీ సింగ్ ప్రభుత్వ హయాంలో రైల్వే మంత్రిగా పని చేసిన జార్జి ఎన్నో కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. జనతాదళ్‌తో విభేదాల వల్ల 1994లో వేరుపడి  సమతా పార్టీని స్థాపించారు. 1998 – 2004 మధ్య వాజపేయి ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలోనే భారత్ రాజస్థాన్ పోఖ్రాన్‌లో మళ్లీ ఐదు అణు పరీక్షలు జరిపింది. జార్జి రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్‌తో జరిగిన కార్గిల్ యుద్ధంలో, అందులో మన గెలుపు ఇటీవలి చరిత్ర.

వివాదాలు, కుంభకోణాలు..

Related image

ముక్కుసూటిగా వెళ్లే జార్జిలో బయటికి కనిపించని మరో కోణం కూడా ఉంది. ఆశ్రితుల చెప్పినట్లు విని ఆయన అనేక వివాదాల్లో, కుంభకోణాల్లో ఇరుక్కున్నారు. ఎల్టీటీఈకి మద్దతిచ్చి శ్రీలంక ప్రభుత్వ ఆగ్రహాన్ని చవి చూశారు. టిబెటన్లు, బర్మా తిరుగుబాటుదారులను బలపరిచి భారత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారు. బరాక్ క్షిపణుల కుంభకోణం, కార్గిల్ అమరజవాన్ల  శవపేటికల కుంభకోణాలు ఆయన వ్యక్తిత్వాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. తెహెల్కా పత్రిక జరిపిన ‘ఆయుధాల కుంభకోణం’ స్టింగ్ ఆపరేషన్ ఫలితంగా మంత్రి పదవికి రాజీనామా చేశారు. దాంతో ఆయన రాజకీయ జీవితానికి తెరపడింది.

పెళ్లి, సహజీవనం..

మాజీ కేంద్ర మంత్రి హుమయూన్ కబీర్ కుమార్తె అయిన లీలా కబీర్‌ను జార్జి 1971లొ పెళ్లి చేసుకున్నారు. వారికి సీన్ అనే కుమారుడు ఉన్నాడు. అతడు న్యూయార్క్‌లో బ్యాంకర్‌గా స్థిరపడ్డాడు. జార్జి, లీలా 1984లో విడిపోయారు. తర్వాత జయా జైట్లీ ఆయనకు దగ్గరయ్యారు. జీవిత చరమాంకంలో ఆయన మతిమరపుతో బాధపడ్డారు. హరిద్వార్‌లోని బాబా రాందేవ్ ఆశ్రమంలో చికిత్స కూడా తీసుకున్నారు. లీలా కబీర్, జయా జైట్లీల మధ్య నలిగిపోయారు. జాార్జిని లీలా రహస్య ప్రాంతానికి తీసుకెళ్లడతో గొడవ కోర్టుకు చేరింది. జయ ఆయనను కలవవచ్చని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.

జార్జి ఫెర్నాండెజ్ మన మధ్య లేకయినా ఆయన జీవితం ప్రేరణగా ఎప్పుడూ తోడు ఉంటుంది. కష్టజీవుల భాగ్యజీవితం కోసం ఆయన పడిన తపన నేటి రాజకీయాలకు ఆదర్శం కావాలి. శత్రువును బలంగా ఢీకొని, పట్టు దొరక్కపోతే మరోవైపు నుంచి దెబ్బకొట్టే వ్యూహం ఒక పాఠంగా మారాలి. ఆయన ఎదుర్కొన్న వివాదాలు, కుంభకోణాలు కూడా ఒక గుణపాఠం కావాలి. Telugu news george fernandes life profile form birth to death a veteran socialist leader from indian politics