జీహెచ్ఎంసీ ‘టాయిలెట్ స్పాన్సర్ షిప్’ - MicTv.in - Telugu News
mictv telugu

జీహెచ్ఎంసీ ‘టాయిలెట్ స్పాన్సర్ షిప్’

October 28, 2017

జన్మదినాలు, పెళ్లిరోజులు తదితర ప్రత్యేక దినోత్సవాలను మరింత వినూత్నంగా జరుపుకోవాలని ghmc ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టింది. ‘స్వచ్ఛ భారత్’ స్పూర్తిని ప్రతి ఒక్కరిలో కలిగించేందుకు “టాయిలెట్ స్పాన్సర్ షిప్” అనే కార్యక్రమాన్ని ghmc కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి నేడు ప్రారంభించారు.

బేగంపేట్ లాలానగర్‌లో ఉన్న టాయిలెట్‌ను ఇటీవల తనిఖీ చేసిన కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి, టాయిలెట్‌ను రోజుకు 50 మందికి పైగా ఉపయోగించుకుంటుండగా,మరో 50కి పైగా డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తూ బహిరంగ మలమూత్రాలను విసర్జిస్తున్నారని తెలిపారు. ఒక్క రోజుకు, ఒక స్పాన్సర్ ద్వారా టాయిలెట్ నిర్వహణకు 500రూపాయలు అందిస్తే, ప్రతి ఒక్కరికీ ఫ్రీగా టాయిలెట్ ఉపయోగించవచ్చనే ఆలోచన కమీషనర్‌కు కలిగింది.

దీనితో ఎవరైనా తమ పుట్టినరోజుకుగానీ, పెళ్లిరోజుకుగానీ, ఇంకెవరైనా తమకు ఇష్టమైన వారి పేరుతో ఒక రోజు టాయిలెట్ నిర్వహణకు స్పాన్సర్ చేయాల్సిందిగా డా.బి.జనార్దన్‌రెడ్డి కోరారు. ఈ ఐడియాకు కె.కృష్ణవేణి అనే మహిళ వెంటనే స్పందించింది. బేగంపేట్ ఫ్లై ఓవర్ లీలానగర్‌లో ఉన్న ప్రీ ఫ్యాబ్రికేటెడ్  టాయిలెట్‌లో టేబుల్,కుర్చీలను కేటాయించడంతో పాటు, 10రోజుల పాటు రోజుకు 500 రూపాయలు టాయిలెట్ నిర్వాహణకు స్పాన్సర్ చేసింది. ఇలాంటి టాయిలెట్ నిర్వహణ స్పాన్సర్ షిప్ కార్యక్రమాన్ని నగరంలోని అన్ని సర్కిల్‌లో ప్రారంభించాలని కమిషన్ డా.బి.జనార్దన్ రెడ్డి తెలియజేశారు.