గోల్కొండ కోటలో దోమల హత్యలు - MicTv.in - Telugu News
mictv telugu

గోల్కొండ కోటలో దోమల హత్యలు

November 27, 2017

ఇవాంకా పుణ్యమా అని మొన్న హైదరాబాద్‌లో ఉన్న కుక్కలు కుక్క సావు సచ్చాయి. ఆవిడగారు  ప్రయాణించబోయే  రోడ్ల మీద కుక్కలు కనిపిస్తే హైదరాబాద్ ఇజ్జత్ పోతదని భావించిన జీహెచ్ఎంసీ అధికారులు దొర్కిన కుక్కను దొర్కినట్టు చంపేశారు. కొన్నింటిని పట్టుకుపోయారు.

ఇప్పుడు దోమల వంతు వచ్చింది.  ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు(జీఈఎస్) వస్తున్న ప్రముఖుల విందుకు గోల్కొండ కోట అందంగా ముస్తాబయ్యింది. ముందే అమెరికా నుంచి వస్తున్న తెల్లపిల్ల ఇవాంకాకు హైదరాబాద్ దోమలు కుడితే దద్దులు వచ్చి, అమెరికా ట్రంప్ దగ్గరనుంచి మాట వస్తుందని అనుకున్నారేమో.. అందుకే  గోల్కొండ కోటలో దోమలతో యుద్ధానికి దిగారు జీహెచ్ఎంసీ అధికారులు. దోమలను లెక్కపెట్టుకుంటూ మరీ చంపుతున్నారు. దోమలను చంపేందుకు ఉన్న అన్ని రకాల ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తున్నారు.

సెక్షన్ ట్యూబ్‌ల ద్వారా గోడ‌ల‌పై ఉన్న దోమ‌ల‌ను ఓ ట్యూబ్‌లోకి పంపించి లెక్కిస్తున్నారు. ఎన్ని దోమలు చచ్చాయో, ఇంకా ఎన్ని దోమలు ఉన్నాయో అని రోజుకు  రెండుసార్లు చంపిన దోమలను లెక్కపెడుతూ ప‌రీక్షలు నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల క్రితం గోల్కొండ  కోట‌లో గంట‌కు రెండు వంద‌ల దోమ‌లు ఉండ‌గా శ‌నివారం నాటికి 40కి త‌గ్గిన‌ట్టు ఈ  ప‌రీక్షల్లో తేలింది. సోమవారంతో గోల్కొండలో దోమల పీడ విరగడవుతుందని, జీహెచ్ఎంసీ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.