తెలంగాణేతరులకూ అవకాశం ఇవ్వండి: హైకోర్టు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణేతరులకూ అవకాశం ఇవ్వండి: హైకోర్టు

March 2, 2018

తెలంగాణేతరులకు కూడా విద్యుత్ శాఖ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. స్థానికత ఆధారంగా విద్యుత్ శాఖలో జూనియర్ అకౌంట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకై నోటిఫికేషన్లను ఇటీవల జారీ చేశారు.  ఈ మేరకు… టీఎస్ ట్రాన్స్‌కో, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌లకు హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ‘స్థానికతను నిర్ణయించే హక్కు విద్యుత్ సంస్థలకు లేదని, పార్లమెంట్ చట్టం పరిధిలోనే స్థానికత నిర్ణయ ఆమోదం వుంటుంది ’ అని హైకోర్టులో కొందరు  వాజ్యాలు దాఖలు చేశారు.ఈ వాజ్యాలకు సంబంధించి… తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం గురువారం (మార్చి 1) విచారణ చేపట్టింది. ఈ క్రమంలో తెలంగాణేతరులు దరఖాస్తులు చేసుకోవటానికి అవకాశం కల్పించాలని, రాత పరీక్షలకు కూడా అనుమతించాలని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్‌ సంస్థలు కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. విద్యుత్ సంస్థల నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని.. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనతో ఏకీభవించిన ధర్మాసనం సానుకూల స్పందన తెలపటం గమనార్హం.