బంగారం కొనండి పేటీఎమ్‌లో..!

ఇంత వరకు మనం పేటీఎమ్ ద్వారా డబ్బు లావాదేవీలనే చూశాం. ఇక నుండి బంగారం అమ్మకాలను కూడా చూడబోతున్నాం. అమ్మకాలు మామూలుగా కాదు భారీగా పెరగనున్నాయి. త్వరలో వస్తున్న దీపావళి పండగ సందర్భంగా తమ ప్లాట్‌ఫామ్‌పై బంగారం అమ్మకాలు ఐదింతల వృద్ధిని నమోదు చేస్తాయని పేటీఎం అంచనా వేస్తోంది. గోల్డ్‌ రిఫైనరీ ఎంఎంటీసీ-పీఏఎంపీతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న పేటీఎం, తమ ప్లాట్‌ఫామ్‌పై బంగారం కొనుగోళ్లకు వినియోగదారులకు అనుమతి ఇచ్చింది.  ఏడాది మొదట్లో ఎంఎంటీసీ – పీఏఎంపీతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న పేటీఎం, ఒక్క రూపాయికే బంగారాన్ని ఆఫర్‌ చేసిన సంగతి తెలిసిందే. పేటీఎమ్ కష్టమర్లను మరింత విస్తృత పరుచుకోవడానికి మార్కెటింగ్‌కు కంపెనీ రూ.10 కోట్లను పెట్టుబడులు పెడుతోంది.

ఇది మాత్రమే కాదు దీపావళి గోల్డ్ అమ్మకాలను కూడా జోరుగా ప్రారంభించింది. అక్టోబర్‌ 10 నుంచి అక్టోబర్‌ 19 వరకు పేటీఎమ్‌లో బంగారం కొన్నవారికి ఎక్కువ రివార్డింగ్‌ కూడా ఇస్తోంది. కనీసం రూ.10వేల మొత్తంతో కొనుగోలు చేస్తే 3 శాతం అదనపు బంగారాన్ని అందిస్తున్నామని చెప్పారు.

‘బంగారమంటే భారతీయులకు అత్యంత ప్రీతి. ఈ పండగల సీజన్లకు తప్పకుండా వారు బంగారాన్ని కొంటారు’ అని పేటీఎం సీనియర్‌ వైస్‌-ప్రెసిడెంట్‌ నితిన్‌ మిశ్రా చెప్పారు. ఈ ఆఫర్‌పై ఇప్పటికే చాలా మంది కష్టమర్లు బంగారాన్ని కొనుగోలు చెయ్యటానికి సిద్ధంగా వున్నారు.

SHARE