గౌడన్నలకు తెలంగాణ ప్రభుత్వం వరాలు - MicTv.in - Telugu News
mictv telugu

గౌడన్నలకు తెలంగాణ ప్రభుత్వం వరాలు

March 23, 2018

రాష్ట్ర గౌడన్నలపై తెలంగాణ ప్రభుత్వం వరాల ఝల్లు కురిపించింది. తాటి, ఈత చెట్లపై పన్నును పూర్తిస్థాయిలో రద్దు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఉద్యమ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం గౌడ కులస్థులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పన్ను బకాయిలున్నవారు వాటిని చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ పన్నుల రద్దుతో ప్రభుత్వంపై రూ. 6.38 కోట్ల మేర భారం పడనుందని వివరించారు. వృత్తిలో భాగంగా ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి మృతి చెందితే చెల్లించే పరిహారాన్ని రూ. 2లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచినట్టు చెప్పారు.  శాశ్వత అంగవైకల్యం పాలైనా పరిహారంగా రూ.5 లక్షలు చెల్లిస్తామని పేర్కొన్నారు. గీత కార్మికుల పెన్షన్‌ను రూ.200 నుంచి రూ.1000కి పెంచుతున్నట్టు ప్రకటించారు.‘ ఉమ్మడి రాష్ట్రంలో గౌడ వృత్తిదారుల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది.  సామాజిక విధ్వంసం జరిగింది. దీన్ని చక్కదిద్దే దిశగా కుల వృత్తులుసహా వారి జీవన విధానాల మెరుగుకు పలు చర్యలు చేపడుతున్నాం. ఈ దిశలోనే గౌడన్నల సంక్షేమం కోసం 5 ఎకరాల భూమి కేటాయింపుతోపాటు అందులో భవన నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో  చౌక మద్యం ప్రవేశపెట్టిన సమైక్య పాలకులు కల్లుగీత కార్మికులను మోసగించారు. హరిత హారంలో భాగంగా చెరువు గట్లు, నదీ పరీవాహక ప్రాంతాలు, వాగులు, వర్రెలకు ఇరువైపులా కోటి 70 లక్షల ఈత, తాటి, ఖర్జూర మొక్కలు నాటాం. చెట్ల లైసెన్స్ రెన్యువల్ గడువును ఐదేండ్ల నుంచి పదేండ్లవరకు పొడిగించాం. గీత కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను తెరిపించాం ’ అని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.