సారూ.. మారిందన్నారు...దవాఖాన్ల తీరు..ఎక్కడ మారింది? - MicTv.in - Telugu News
mictv telugu

సారూ.. మారిందన్నారు…దవాఖాన్ల తీరు..ఎక్కడ మారింది?

February 1, 2018

ఈరోజుల్లో సర్కారు దవాఖానాకు పోవాలంటే చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే అరకొరగా ఉండే సదుపాయాలు. పట్టించుకోని డాక్టర్లు, రోగులకు పీక్కు తినే సిబ్బంది. డబ్బున్న మారాజులు అయితే కార్పోరేట్ హాస్పిటళ్ల బాట పడుతుంటారు. కానీ పేద ప్రజలకు సర్కార్ దవాఖానాలే దిక్కు.

అక్కడ సదుపాయాల సంగతి దేవుడెరుగు. దవాఖానాలో అడుగుపెట్టగానే చేతులు తడిపితేగాని పేషెంట్లను పట్టించుకోని సిబ్బంది. దేవుడు వరమిచ్చినా పూజారి వరమియ్యడు అన్నట్లు. డాక్టర్ ను కలవాలంటే లంచం, మందులు కావాలంటే లంచం, రోగిని చూడడానికి లంచం. రోగిని చూసుకోవడానికి లంచం. వీల్ చైర్ కావాలంటే లంచం, స్ట్రెచర్ తేవాలంటే లంచం. బెడ్డు షీటు మార్చాలంటే లంచం. సూదిమందు ఎయ్యాలంటే లంచం. ఆఖర్కి పేషెంట్ చచ్చినా బంధువులకు  చూపించాలన్నా  లంచం. అడుగడుగునా లంచం.  అడుగడుగా చేతులు తడుపుతేగాని సర్కార్ దావఖానలో మనకు వచ్చిన రోగం నయం కాదు. హైదరాబాద్’లోని ఉస్మానియా దవాఖానాలో సిబ్బంది లంచం పేరుతో రోగులకు పీక్కుతింటున్నారు. ఆసుపత్రిలో అడుగుపెట్టిన దగ్గరనుంచి డిస్చార్జ్ అయ్యేవరకు వాళ్ల చేతులు తడిపితేగాని అక్కడ సూది మందు కూడా పడదు. సర్కార్ ఆసుపత్రులలో సిబ్బంది తీరుపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా…చర్యలు తీసుకున్నా సిబ్బంది మాత్రం మాతీరు ఇంతే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు.

ఉస్మానియాలో సిబ్బంది తీరు ఎలా ఉందో రోగి బంధువులు తీసిన ఈవీడియో చూస్తే అర్థమవుతుంది, సర్కారు ఆసుపత్రిలో పరిస్థితి ఏంటో. ఓవైపు ప్రభుత్వం…కార్పోరేట్ హాస్పిటళ్లకు ధీటుగా సర్కారు దవాఖానాలను తీర్చిదిద్దాలని ప్రయత్నాలు చేస్తుంటే గవర్నమెంట్ దావాఖానాలో సిబ్బంది తీరు మాత్రం శవం కంటే అద్వానంగా తయారైంది. మరి వీళ్ల తీరు ఎప్పుడు మార్చుకుంటారో? నేను పోత బిడ్డో కేవలం సర్కారు దవాఖానాకు అని ప్రజలు పాటలు పాడుకునే రోజులు ఎప్పుడు వస్తాయో చూడాలె.