భక్తులారా  ఏకం కండి.. పోరాడితే పోయేదేమీ లేదు, జీఎస్టీనే! - MicTv.in - Telugu News
mictv telugu

భక్తులారా  ఏకం కండి.. పోరాడితే పోయేదేమీ లేదు, జీఎస్టీనే!

March 1, 2018

‘పొడుగోడి నెత్తిని పోషమ్మ గొడితే పొడుగోడుపోయి పొట్టోన్ని గొట్టిండట’.. సామెత కొంచెం తేడా కొడుతోంది కదా…ఈ వార్తకు  ఇదే కరెక్ట్. ఇక్కడ పొడుగోడు  గుడిలైతే, పొట్టోడు భక్తులు..ఇక పోశమ్మ అంటే ప్రభుత్వం.

అవును  ప్రభుత్వం  గుడిల మీద జీఎస్టీ పన్ను రుద్దితే  వాళ్లు తీసుకొచ్చి  భక్తుల జేబులకు రుద్దబోతున్నారు. అంటే దేవుడికి సేవలు చేయాలంటే  జేబులో పర్సు  అందులో పైసలు పెట్టుకొని పోవాల్సిందే. ఇక నుండి మీరు  అష్టోత్తరం చేయించినా, హారతి సమర్పించినా ఆర్జిత సేవల రూపంలో జీఎస్టీ పన్ను కట్టాల్సిందే. సేవ ఏదైనా పన్నుపోటు మాత్రం తప్పదట.

గుళ్ల ఆదాయంలో 12 శాతం దేవాదాయ శాఖకు, 3 శాతం అర్చక సంక్షేమ నిధికి, మరో 3 శాతం సర్వ శ్రేయోనిధికి  చెల్లించడానికి  దేవలయాలు భారంగా భావిస్తున్నాయి. 18 శాతం జీఎస్టీ ప్రభుత్వానికి కట్టడానికి చాలా  ఇబ్బంది పడుతున్నారట. అందుకే  ఈ భారాన్ని భక్తులపై వేయాలని ఆలయాలు నిర్ణయం తీసుకున్నాయి. జీఎస్టీ భారంతో ఇప్పటికే కొన్ని గుళ్లలో ప్రసాదం  ధరలు రూ.5 చొప్పున పెంచారు.

ఇక మీరు గుడికి  వెళ్లేటప్పుడు. పువ్వులు, కొబ్బరి కాయలు  అగరొత్తులు  కుంకుమ, పసుపుతో పాటుగా  జేబు నిండా డబ్బులు కూడా  పెట్టుకొని వెళ్లండి. లేకపోతే  దేవుడు కనికరించినా  ఆలయ అర్చకులు కనికరించరన్న మాట గుర్తుంచుకోండి.  అయితే దేవుడిని కొలిచే  దగ్గర కూడా జీఎస్టీ ఏంటి అని పలువురు  భక్తులు  మండిపడుతున్నారు. వెంటనే దీన్ని రద్దు చేయాలని  డిమాండ్ చేస్తున్నారు.