ఫ్రిజ్, వాషింగ్ మిషన్లపై తగ్గింపు - MicTv.in - Telugu News
mictv telugu

ఫ్రిజ్, వాషింగ్ మిషన్లపై తగ్గింపు

November 20, 2017

గత వారంలోనే 28 శాతం శ్లాబులో ఉన్ 178 వస్తువులపై జీఎస్‌టీ పన్ను రేటును తగ్గించిన కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. మహిళలను దృష్ఠిలో పెట్టుకుని కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌పై కూడా పన్ను రేట్లను తగ్గించే ప్రయత్నం చేస్తున్నది.   అందులో భాగంగా వాషింగ్‌ మిషన్లు, ఏసీలు, ఫ్రిజ్‌లపై ప్రస్తుతమున్న 28 శాతం పన్ను రేట్లను తగ్గించాలని చూస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం 28 శాతం శ్లాబులో కేవలం 50 వస్తువులే ఉన్నాయి. మహిళలను లక్ష్యంగా చేసుకుని పన్ను రేట్లను తగ్గించబోతున్నట్టు ఓ సీనియర్‌ ప్రభుత్వాధికారి చెప్పారు. మహిళలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల రెస్టారెంట్లపై కూడా జీఎస్టీ రేట్లను తగ్గించినట్టు పేర్కొన్నారు. ఇదిలా వుండగా పన్ను రేట్లు అధికంగా వుండటంతో తమ విక్రయాలు తగ్గిపోయాయని వివిధ కంపెనీలు ఫిర్యాదులు చేస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంటే తమ వస్తువులకు డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు ఆయా వస్తువుల తయారీదారులు.

అలాగే కన్జ్యూమర్ డ్యూరెబుల్స్, ఎలక్ట్రిక్ వస్తువుల పన్ను రేట్లను 18 శాతానికి తగ్గించనున్నట్టు సమాచారం.

ఇక ఇవి లగ్జరీ గూడ్స్‌ నుండి మినహాయింపబడతాయని వినవస్తోంది. ఫేషియల్‌ మేకప్‌, షాంపూలు, డిటర్జెంట్‌, వాషింగ్‌ పౌడర్‌,  చాక్‌లెట్లు, చేతివాచీలు, వెట్‌ గ్రైండర్లు, బ్యాటరీలు తదితరాలపై జీఎస్‌టీని 18 శాతానికి తగ్గించారు.  ‘ అన్నీ కన్జ్యూమర్ డ్యూరెబుల్స్‌ను ఒకే పన్ను 18 శాతం కిందికి తీసుకువస్తే, దేశీయ తయారీదారులకు మేలు జరుగుతుంది. ధరలు తగ్గి డిమాండ్ పెరుగుతుంది ’ అని డెలాయిట్ ఇండియా పార్టనర్ ఎంఎస్. మనీ తెలిపారు.