ఊరకుక్కలు కోట్లకు తోకలెత్తాయి.. - MicTv.in - Telugu News
mictv telugu

ఊరకుక్కలు కోట్లకు తోకలెత్తాయి..

April 9, 2018

మీకు ఎవరికైనా కోపమొస్తే.. పోరా కుక్క.. పోవే కుక్క.. అని మాత్రం తిట్టకండి. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందన్న సామెత మరోసారి నిజమైంది మరి. ఒక ఊరిలోని వీధికుక్కలు కోట్లకు పడగలెత్తాయి. నమ్మలేకపోతున్నారా? అయితే చదవండి మరి.

గుజరాత్‌లోని మోహసానా జిల్లాలోని పంచోట్ గ్రామసింహాల కథ ఇది. గ్రామంలో ‘మద్ ని పతి కుతారియా’ అనే పేరుతో ఒక అనధికారిక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్కు 21ఎకరాల భూమి ఉంది. అది కూడా మాంచి గిరాకీ ఉన్న బైపాస్ రోడ్డును అనుకుని ఉంది. ఎకరం రూ. 3.5 కోట్లు  పలుకుతోంది. ఈ భూమి కుక్కుల పేరుతో లేదు. అయితే దానిపై వచ్చే ఆదాయం మాత్రం వాటికే చెందుతోంది. ఈ ట్రస్ట్ ఆధీనంలో మొత్తం 70 శునకాలు ఉన్నాయి. వాటి పరిక్షణను ట్రస్టే చూసుకుంటుంది.

ట్రస్ట్ ప్రెసిడెంట్ ఛగన్ భాయీ పటేల్ మాట్లాడుతూ ….‘గ్రామంలో శునకాలను ప్రేమగా  పెంచడం ఈ నాటిది కాదు. చాలామంది శునకాల సంరక్షణకు ట్రస్ట్‌కు భూములను దానంగా అందజేశారు. అప్పట్లో ఈ భూములకు అంత విలువ లేదు. ఇప్పుడు బైపాస్ రోడ్డు నిర్మాణం వల్ల  ఈ భూముల రేట్లు బాగా పెరిగాయి. దీంతో శునకాల సంరక్షణ కోసం ప్రతీయేటా సంస్థ నియమిత రీతిలో కొద్దిపాటి భూమిని విక్రయిస్తుంటుంది. ఆ భూముల్లో పంటే పంటలను అమ్మగా డబ్బూ వస్తుంటుంది. దాదాపు కోటి రూపాయాలు వస్తోంది. ఆ మొత్తంతో కుక్కలను పోషిస్తున్నాం. వాటికోసం స్థానిక మహిళలు రోజూ వందలాది రొట్టెలు తయారు చేస్తారు’ చెప్పారు.