జీవీకే టు మెహిదీపట్నం.. కొత్త ఫ్లైఓవర్ - MicTv.in - Telugu News
mictv telugu

జీవీకే టు మెహిదీపట్నం.. కొత్త ఫ్లైఓవర్

March 9, 2018

హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల సౌకర్యార్థం మరో కీలక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మించేందుకు సన్నాహాలు వేగవంతం అయ్యాయి. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-1 లోని జీవీకే మాల్‌ నుంచి మెహిదీపట్నం వరకు దీన్ని నిర్మించేందుకు సిద్ధమవుతోంది సర్కార్.  ఐదు కిలోమీటర్ల మేర నాలుగు లేన్లుగా ఈ స్టీల్‌ వంతెన నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ కసరత్తు మొదలుపెట్టింది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రోగ్రామ్‌ (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా నిర్మించనున్న ఈ ఫ్లైఓవర్‌కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పన బాధ్యతలను కన్సల్టెన్సీకి అప్పగించారు.ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి పూనుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి, గచ్చిబౌలి, ఐటీ కారిడార్‌కు వెళ్ళేవాళ్ళకు ఎటువంటి ట్రాఫిక్ చిక్కులు లేకుండా ఈ వంతెన నిర్మాణాన్ని తలపెట్టనున్నారు. నాలుగు లేదా ఆరు లేన్లుగా నిర్మించే వంతెనకు 600 కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. డీపీఆర్‌ వచ్చిన అనంతరం ప్రభుత్వానికి పంపుతామని ఓ అధికారి తెలిపారు.

ఎక్కడినుంచి ఎక్కడి వరకు..

ఈ ఫైఓవర్ జీవీకే సమీపంలోని పోస్టాఫీస్‌ నుంచి మొదలయి రోడ్‌ నంబర్‌-1 నుంచి మాసబ్‌ట్యాంక్‌ ఫ్లై ఓవర్‌ పక్క నుంచి మెహిదీపట్నం రైతు బజార్‌ వెనకాల ఉన్న రహదారి వద్ద ల్యాండ్‌ అవుతుంది. జీవీకే వద్ద నాలుగు/ఆరు లేన్లుగా మొదలయ్యే ఫ్లై ఓవర్‌… పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌‌వే వద్దకు వెళ్లే సరికి రెండు గ్రేడ్‌ సెపరేటర్లుగా వేరవుతుంది. మెహిదీపట్నం బస్టాప్‌ దగ్గరి నుంచి (300 మీటర్ల దూరం ఎస్‌డీ రోడ్‌ వైపు) మొదలయ్యే గ్రేడ్‌ సెపరేటర్‌ సరోజినీదేవి రోడ్‌ వద్ద ఫ్లై ఓవర్‌లో కలుస్తుంది. దీంతో జీవీకే వద్ద వంతెన ఎక్కే వాహనాలు మెహిదీపట్నం రైతు బజార్‌ వద్ద దిగుతాయి. మెహిదీపట్నం వద్ద ఫ్లై ఓవర్‌ పైకి వచ్చే వెహికిల్స్‌ జీవీకే వద్ద కిందకు దిగుతాయి. ఈ వంతెనకు మధ్యలో అప్‌, డౌన్‌ ర్యాంపులు కూడా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.