రేప్ కేసులో 31 ఏళ్లు.. జీవితకాలం ఆలస్యంగా న్యాయం! - MicTv.in - Telugu News
mictv telugu

రేప్ కేసులో 31 ఏళ్లు.. జీవితకాలం ఆలస్యంగా న్యాయం!

April 6, 2018

ఈ ప్రపంచంలో అత్యంత దురదృష్టవంతుడు అంటే ఈయనేనేమో. చేయని నేరానికి 31 సంవత్సరాలు జైలు ఊచలు లెక్కబెట్టాడు. అబ్దుల్ షేక్ అతని పేరు. ఇప్పుడతని వయసు 62 సంవత్సరాలు. సగం జీవితాన్ని జైలుకు సమర్పించిన ధన్యజీవి అనాలా ఈయనను ? చట్టాలు, న్యాయస్ధానాలు ఎంత నెమ్మదిగా పని చేస్తాయో ఈ ఘటన నిరూపిస్తోంది.1986 సెప్టెంబరు 17న అబ్దుల్‌ షేక్‌ తనను అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ  స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆయన ఆమెకు అత్యంత సమీప బంధువు కావటం మూలాన అతని పేరు చెప్పటానికి భయపడ్డాను అని తన ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త ఇప్పుడు తనకు మద్దతు ఇవ్వటంతో తాను ఫిర్యాదు చేయటానికి వచ్చానని తెలపింది. 28 సెప్టెంబర్ 1986 లో అబ్దుల షేక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

కాగా బాధితురాలు విచారణకు కోర్టుకు రాకపోవటంతో కేసు అలా వాయిదాలు పడుతూ వచ్చింది. ఈ కేసును వాదించడానికి బాధితురాలు, ఆమె లిఖిత పూర్వకంగా ఇచ్చిన ఆధారాలు మాత్రమే ఉండటంతో కేసును వాయిదా వేసి అబ్దుల్‌షేక్‌ను ట్రయల్‌లో ఉంచారు. ఇలా వుండగా కారణాలేంటో తెలియకుండా ఫిర్యాదు చేసిన ఆరు నెలల్లోనే ఆ దంపతులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వారిద్దరు ఆత్మహత్య చేసుకోవటానికి అబ్దుల్ షేకే కారణం అంటూ ఆమె బంధువుల ఆరోపించారు. ఈ క్రమంలో అబ్దుల్‌కు బెయిల్‌ ఇవ్వరాదంటూ సెషన్‌ కోర్టు తీర్పిచ్చింది.

చాలా ఏళ్లు మూత పడిందనుకున్న ఈ కేసు మళ్లీ గతేడాది సెప్టెంబరులో వాదనకు వచ్చింది. ఈలోపు ఆధారాలు తెచ్చుకుంటామని బాధితురాలి తరఫు బంధువులు తెలపడంతో కేసును కోర్టు వాయిదా వేసింది. అప్పుడు కూడా వారు బలమైన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టడంలో విఫలం అవ్వడంతో స్థానిక సెషన్‌ కోర్టు మంగళవారం అబ్దుల్‌‌ను నిర్దోషిగా ప్రకటించి విడిచిపెట్టింది. అరెస్ట్ అయ్యేనాటికి అబ్దుల్ రైల్వే శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

చట్టానికి కళ్ళు లేవు అంటారు. నిజమే తనకి దోషులెవరో, నిర్దోషులెవరో తెలియదు. కానీ ఒక వ్యక్తి యొక్క సగం జీవితాన్ని అన్యాయంగా ఇలా బలి తీసుకోవటం ఏ చట్టంలో రాసి పెట్టి వుంది ? అయ్యో ఈ నేరం నువ్వు చేయలేదని రుజువు అయింది నువ్వు చక్కగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని కోర్టులు చేతులు దులుపుకుంటే అంతవరకు అతను కోల్పోయిన జీవితాన్ని ఈ చట్టాలు తిరిగి తెచ్చివ్వగలవా ? అంటూ ఈ విషయం తెలిసినవారి వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.