భార్య, ప్రియుడి వీడియో.. భర్త ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

భార్య, ప్రియుడి వీడియో.. భర్త ఆత్మహత్య

March 15, 2018

రోజురోజుకు మనుషులు విలువలు మరిచిపోతున్నారనటానికి ఈ ఘటన అద్దం పడుతోంది. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి వేధించింది. చివరికి భర్త ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం, ధర్మారావుపేటలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. నక్క ధర్మారాజు (27) అనే యువకుడికి గతేడాది జగిత్యాల జిల్లా కన్నాపూర్‌కు చెందిన నాగలక్ష్మితో వివాహం జరిగింది. అయితే నెలరోజుల క్రితం నాగలక్ష్మి పుట్టింటికి వెళ్లింది. భర్త ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదు. జగిత్యాల జిల్లా వెల్గటూర్‌కు చెందిన మంత్రి మహేష్‌తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోందని తెల్సి భర్త  భార్యను నిలదీశాడు.

దీంతో నాగలక్ష్మి మరింత రెచ్చిపోయింది. తమ అక్రమ సంబంధాన్ని రహస్యంగా వుంచటం ఎందుకనుకుంది. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి ముద్దూ, ముచ్చట్లలో వున్న అసభ్యకర వీడియోలను ధర్మరాజుకు వాట్సాప్‌ చేయసాగారు. అంతటితో ఆగకుండా నాగలక్ష్మి భర్త కట్టిన తాళిని తీసేసి ప్రియుడితో కట్టించుకున్న వీడియోను భర్తకు షేర్ చేసింది.

తరచూ ప్రియుడు మహేష్ కూడా ధర్మరాజుకు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో తిట్టేవాడట. ‘ నీకు చేత కాదు కాబట్టే నీ పెళ్ళాం నా ఒళ్ళో పడింది ’ అని అవమానించేవాడట. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ధర్మరాజు తన పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన బంధువులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ధర్మరాజు మరణానికి కారకులైన నాగలక్ష్మి, ఆమె ప్రియుడు మహేష్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబసభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. మృతుడి తమ్ముడు నక్క సత్తయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.