కేసీఆర్‌ను దీవించండి - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్‌ను దీవించండి

December 17, 2017

ఆదివారం నాడు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఇప్పగూడెం దగ్గర నాగుల చెరువు ఫీడర్ ఛానల్‌కు మంత్రి  హరీశ్ రావ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ తెలంగాణ ప్రజల కోసం 36 నెలల్లో 365 సంక్షేమ పథకాలు రచించి,అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలు నిండు మనస్సుతో దీవెనలు ఇవ్వాలని కోరారు

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి కాళేశ్వరం ప్రాజక్ట్ నుంచి సాగునీటిని అందించనున్నట్టు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. వచ్చే జనవరి చివరికల్లా దేవాదుల పంపులు నడిపేందుకు ప్రయత్నిస్తున్నట్టు  తెలిపారు. మిడ్ మానేరు నుంచి గౌరవెల్లి కాలువ ద్వారా ఘన్పూర్ కు కాళేశ్వరం నీళ్ళు పారతాయన్నారు. స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం లో ఇటు దేవాదుల, అటు కాళేశ్వరం నుంచి మొత్తం 1 లక్షా 25 వేల ఎకరాలకు సాగు నీరందుతుందని మంత్రి తెలిపారు.

దేవాదుల పంపులు 365 రోజులు నడిచేలా ప్రణాళిక అమలు చేయనున్నట్టు చెప్పారు..8.25 కిలోమీటర్ల పొడవైన ఈ ఫీడర్ ఛానల్ పనులను 4 కోట్ల 45 లక్షలతో మిషన్ కాకతీయ 4వ దశ కింద చేపడుతున్నారు.నాగులచెరువు ఫీడర్ ఛానల్ నుంచి 27 చెరువులను నింపనున్నారు.నాలుగు నెలల్లో ఈ పనులను పూర్తి చేసి 2400 ఎకరాలకు సాగునీటిని అందించాలని ఇరిగేషన్ అధికారయంత్రాంగాన్ని మంత్రి హరీశ్ రావు కోరారు.

నెలకు 6 టి.ఎం.సి.ల చొప్పున 10 నెలల పాటు 60 టి.ఎం.సి. ల నీటిని స్టోరేజ్ చేసుకునే విధంగా తుపాకులగూడెంను ముఖ్యమంత్రి కేసీఆర్ డిజైన్ చేశారని మంత్రి తెలిపారు.రీ ఇంజనీరింగ్ వల్ల దేవాదుల ప్రాజెక్టు నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగునీరందుతుందని హరీష్ రావు తెలియజేశారు.

దేవాదుల లిఫ్ట్ 3 పథకం పనులను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. ఈ లిఫ్ట్ పనులు తుపాకులగూడెం లో కీలకమని మంత్రి అన్నారు. ప్రతి ఊరికి కాలువల ద్వారా నీలివ్వాలన్నది సి.ఎం.లక్ష్యమని ఆయన చెప్పారు.కోటి ఎకరాల మాగాణి కేసీఆర్ కల అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ వల్ల గత సంవత్సరం 5 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు వచ్చిందని, భారీ, మధ్య తరహా ప్రాజెక్టు ల్ ద్వారా మరో 9 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వాలు చెరువులను నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. జనవరి 1 వ తేదీ నుంచి 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతున్నందున నీటిని జాగ్రత్తగా, పొదుపుగా వాడుకోవాలని వ్యవసాయ  పంపుసెట్లకు వాడుతున్న ఆటోమేటిక్ స్టార్టర్ లను తొలిగించుకొని భూగర్భ జలాలు కాపాడుకోవాలన్నారు. చేతికందిన పంటలు  ఎండిపోకుండా చూడాలని రైతులను హరీష్ రావు కోరారు.