ఆటోస్టార్టర్లు తీసేద్దాం..భూగర్భజలాలను కాపాడుదాం - MicTv.in - Telugu News
mictv telugu

ఆటోస్టార్టర్లు తీసేద్దాం..భూగర్భజలాలను కాపాడుదాం

December 16, 2017

ఆటోస్టార్టర్లు తొలగించండి. భూగర్భ జలాలు కాపాడండి అనే నినాదం శనివారం సిద్ధిపేటలో మార్మోగింది. మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో జరిగిన రైతుల అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన లభించింది. ఆటోమేటిక్ స్టార్టర్ల తొలగింపుపై మంత్రి రైతుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. సిద్దిపేట మండలం బంజెరుపల్లి గ్రామంలో రైతులు,ప్రజలు తమ భావుల వద్ద ఉన్న మోటార్‌ల ఆటోమేటిక్ స్టార్టర్‌లు తీసేసి అవగహన సదస్సుకు స్టార్టర్‌లతో సహా  హాజరయ్యారు. బంజారుపల్లి ఆటోస్టాటర్ తొలగించి రాష్టానికే ఆదర్శంగా నిలిచిందని హరీష్ అన్నారు. దేశంలో రైతుకు 24 గంటలు ఉచిత కరెంటు  సరఫరా చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని హరీష్ రావు తెలిపారు.

గ్రామాలకు,పరిశ్రమలకు,రైతులకు అందరి అవసరాలకు 24 గంటలు కరెంటు ఇస్తున్న ఘనత ముఖ్య మంత్రి కేసీఆర్ దే అని అన్నారు.  గతంలో కాంగ్రెస్ హయాంలో 6 గంటల కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదన్నారు.తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో కావాల్సినంత  కరెంట్ ఇస్తున్నందున ఆటోమేటిక్ స్టార్టర్ల అవసరం లేదన్నారు. రాష్ట్రం రాక ముందు కరెంటు  లోఓల్టేజ్ తో మోటార్లు కాలి పోయేవని మంత్రి అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాణ్యమైన కరెంటు సరఫరా జరుగుతున్న దని చెప్పారు. అవసరమైన సబ్ స్టేషన్లు ,ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మోటార్లు,ట్రాన్స్ఫార్మర్స్ కాలి పోయే సంఘటనలు ఉండవన్నారు.

ఉచిత కరెంటు అనే ఉద్దేశ్యంతో అవసరానికి మించి నీరు తొడితే భూగర్భ జలాలు ఇంకి పోయి పంటలు ఎండిపోతాయని హరీశ్ రావు రైతులకు చెప్పారు. యాసంగిలో నాట్లు ముమ్మరంగా వేశారని, కరెంటు,బోరు నీరు ఫుల్ గా ఉన్నాయన్నారు. ఫిబ్రవరి,మార్చి నెలలో బోర్లలో నీరు రాక పంట పొట్ట కొచ్చే సమయానికి ఎండిపోతే,మళ్లీ బోర్లు వేసి అప్పుల పాలయ్యే పరిస్థితి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రాన్స్ ఫార్మర్, సబ్ స్టేషన్, గ్రామ పరిధిలో కమిటీలు వేసి ఆటోస్టార్టర్ లు తొలగించాలని మంత్రి కోరారు. ఇది సమిష్టి బాధ్యతగా అందరూ గుర్తించాలన్నారు.

వచ్చే వానాకాలం నుండి ఎకరానికి రెండు పంటలకు పెట్టుబడి ఖర్చులు లేకుండా 8000 రూపాయలు రైతుకు సహాయం చేస్తున్నమని తెలిపారు.నీటిని పొదుపుగావాడుకుందామన్నారు. ఉన్న నీటిని సద్వినియోగం చేసుకొని పంటలను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. రైతులను చైతన్యం చేసే దిశగా ఆటో స్టార్టర్లు తొలగించేందుకు ప్రజాప్రతినిధులు,అధికారులు అవగాహన కలిగించాలని కోరారు. పండించిన ప్రతి పంటకు మద్దతుధర కల్పించి రైతుకు ప్రభుత్వం అండగా ఉంటున్నదని చెప్పారు. వచ్చే సంవత్సరం కాళేశ్వరం పూర్తి చేసి యాదాద్రి, నల్గొండ, వరంగల్,సిరిసిల్ల,కరీంనగర్,సిద్ధిపేట జిల్లాలకు సాగు నీరందిస్తామని హరీష్ రావు తెలిపారు.