సిద్దిపేటలో ఆధునిక రైతుబజార్‌ను ప్రారంభించిన హరీష్ రావు - MicTv.in - Telugu News
mictv telugu

సిద్దిపేటలో ఆధునిక రైతుబజార్‌ను ప్రారంభించిన హరీష్ రావు

February 5, 2018

సిద్దిపేట జిల్లాకు మరో ప్రత్యేకత సంతరించుకున్నది. ఆధునిక రైతు బజార్ ఇప్పుడక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జిల్లా కేంద్రంలో ఆధునిక రైతు బజారును మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సోమవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ‘ సిద్దిపేటలోని నూకసాని కుంటలో ఏర్పడిందే పాత రైతు బజార్. ప్రజలకు, రైతులకు ఇద్దరికీ వసతులు కల్పించేలా అప్పటి ఎమ్మెల్యే, ఇప్పటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు రైతు బజారును ఏర్పాటు చేశారు. 1999లో 1736 గజాల స్థలంలో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఉదయం 6గంటల నుంచి రాత్రి 9గంటల వరకు రైతులు కూరగాయలు అమ్ముకుంటూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక రూ. 8.16 కోట్ల వ్యయంతో అత్యంత ఆధునికంగా సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు నిర్మాణం చేపట్టి ఆధునిక రైతు బజారుగా తీర్చి దిద్దామని.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతుల సౌకర్యార్థం ఈ రైతు బజారును ఏర్పాటు చేశామని ’ మంత్రి తెలిపారు.

సిద్ధిపేట, చిన్నకోడూర్, నంగునూరు, దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి మండలాల నుంచి 300 నుంచి 350 మంది కూరగాయలు పండించే రైతులు ఇక్కడికి వచ్చి కూరగాయలు అమ్ముకుంటున్నారు. ఈ రైతు బజారులో రోజూ 600 నుంచి 700 క్వింటాళ్ల కూరగాయల అమ్మకాలు జరుగుతాయి.ఆధునిక రైతు బజార్ ప్రత్యేకతలు :

ఈ రైతు బజార్‌లో మొత్తం 332 స్టాల్స్ వున్నాయి. రైతుల కోసం ప్రతీ ఫ్లోర్‌లో టాయిలెట్స్, ఎల్ఈడీ లైటింగ్ సదుపాయాలు వుంటాయి. అమ్ముడు పోగా మిగిలిన కూరగయాలు భద్ర పరుచుకోవడానికి సెల్లార్‌లో5మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన కోల్డ్ స్టోరేజ్ వుంటుంది. రైతుల కోసం మినరల్ వాటర్ ఫ్లాంట్ కూలర్, వృద్ధులు, వికలాంగుల కోసం లిఫ్ట్ సౌకర్యం వుంటుంది. అలాగే ప్రతి ఫ్లోర్‌లో చెత్త బుట్టల ఏర్పాటు వుంటుంది. రైతు బజారు వద్ద పాడైపోయిన కూరగాయలు, వ్యర్థాల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేయడానికి సెల్లార్‌లో బయో గ్యాస్ ఏర్పాటు. రైతులు, వినయోగదారుల భద్రతే లక్ష్యంగా :

రైతులు, వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని నిరంతరం నిఘా ఉండేలా 31 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నామని, అలాగే రైతులు, వినియోగదారుల కోసం కూరగాయల ధరలు సూచిస్తూ 7 ఎల్ఈడీ స్క్రీన్ టీవీలను ఏర్పాటు చేసుకున్నామని మంత్రి చెప్పారు. కూరగాయలు పండించే రైతులకు ఇప్పటి వరకూ 600 మందికి రైతు బజారులో గుర్తింపు కార్డులు జారీ చేయడం జరిగిందని చెప్పారు. రైతు బజారులో మొత్తం 332 స్టాల్స్ ఏర్పాటు చేశామని, ప్రతి స్టాల్‌కు నెంబరు కేటాయింపు చేయడం జరిగిందని, 3 ప్రవేశ ద్వారాల వద్ద స్వైపింగ్ మిషనరీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.వినియోగదారులు, రైతుల కోసం తూకంలో ఏలాంటి ఇబ్బందులు లేకుండా 400 ఎలక్ట్రానిక్ మిషనరీలను ఏర్పాటు చేసుకున్నాం.  రైతులు, వినియోగదారుల కోసం ఆంధ్రాబ్యాంకు ఏటీఎం కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నామని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ చెప్పారు. ఆధునిక రైతు బజార్‌ను చూసి రైతులు, స్థానికులు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు.