చిరుతతో 15 నిమిషాలు హోరాహోరీ - MicTv.in - Telugu News
mictv telugu

చిరుతతో 15 నిమిషాలు హోరాహోరీ

April 4, 2018

పులి దూరంగా కనపడితేనే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది చిరుతపులి చేయెత్తు దూరంలో వుండి, దాని కళ్ళల్లో మన చావు కనిపిస్తుంటే ఎలా వుంటుంది? చల్లని చెమట్లు పట్టి బతుకు మీద ఆశలు వదులుకోవాల్సిందే అనిపిస్తుంది కదూ. కానీ ఓ యువతి మాత్రం చిరుత పులిని చూసి అస్సలు బెరుకూ, భయం లేకుండా ధైర్యంగా దాని ముందు నిలబడింది. 15 నిమిషాలు దాంతో పోరాడింది. ఆమె ధైర్యానికి పులి తోక ముడవక తప్పలేదు.ఈ ఘటన మహారాష్ట్రలోని సాకోలీ తాలుకా పరిధిలోని ఉస్‌‌గావ్‌లో జరిగింది. వూళ్ళో మేకలు పెంచుకుని జీవనం సాగిస్తున్న జీజాబాయి, కుమార్తె రూపాలీ (21)తో కలిసి ఉంటోంది. ఇంటి ఆవరణలోనే మేకలను కట్టేస్తారు. మార్చి 24వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో చిరుత పులి వచ్చి ఓ మేకను చంపి తింటోంది. దీంతో మేకలన్నీ బెదిరి అరవటంతో లోపల పడుకున్న ఇద్దరు తల్లీ కూతుళ్ళు నిద్రలేచారు.  

తలుపు తెరిచిన చప్పుడుకు వారిని చూసిన చిరుత వారిపై దాడికి దిగింది. అయ్యో ఇద్దరమూ ఆడవాళ్ళమే కదా.. ఇంట్లో ఓ మగదిక్కు వుండుంటే బాగుండు అని వాళ్ళు అనుకోలేదు. తల్లిని వెనక్కి తోసుకుంటూ పులికి అభిముఖంగా నిలబడింది రూపాలీ. 15 నిమిషాల వరకు కర్ర పట్టుకొని దానితో పోరాడింది. నెమ్మదిగా ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళి తలుపు గడియ పెట్టుకున్నారు. ఈమె మానవ సివంగి అనుకున్నట్టుంది ఆ చిరుత.. తోక ముడుచుకుని వచ్చిన దారిన వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన రూపాలీని నాగ్‌పూర్‌లోని ప్రభుత్వ వైద్యవిద్యా కళాశాల ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల పాటు చికిత్స పొంది కోలుకున్న రూపాలీని మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేశారు. చిరుత ముందు చూపిన ఆమె చొరవ, ముఖ్యంగా తల్లిని కాపాడుకున్న తీరును సోషల్ మీడియాలో వేనోళ్ల పొగుడుతున్నారు.