షర్బత్ చేస్తందుకు నీకు ఆ నీళ్ళే దొరికినాయిరా ? - MicTv.in - Telugu News
mictv telugu

షర్బత్ చేస్తందుకు నీకు ఆ నీళ్ళే దొరికినాయిరా ?

March 20, 2018

అప్పట్లో ఆకుకూరలను డ్రైనేజ్ వాటర్‌తో కడిగిన ఓ వ్యాపారి ఎంత ఫేమస్సాయ్యాడో తెలిసిందే. ఇప్పుడు ఇంకొక చిరు వ్యాపారి సోషల్ మీడియాలో ఫేమస్ అవుతున్నాడు. వ్యాపారుల దృష్టి ఎప్పుడు వినియోగదారులు ఇచ్చే డబ్బు మీదే వుంటుంది గానీ వినియోగదారుడి శ్రేయస్సు మీద ఎందుకు వుంటుంది ? అనటానికి ఇది తాజా ఉదాహరణ. వివరాల్లోకి వెళితే గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ కాలూపూర్ పంచకువ ప్రాంతంలో ఓ వ్యక్తి నిమ్మకాయ సోడా అమ్ముతుంటాడు. అసలే ఎండలు ముదురుతున్నాయి. అతను చేసే చల్లని నిమ్మకాయ షర్బత్ తాగి శరీర తాపాన్ని తగ్గించుకుందామని వెళ్తుంటారు చాలా మంది. కానీ అతను చేసిన పని చూస్తే ఎవ్వరు మరోసారి షర్బత్ పేరు ఎత్తుమన్నా ఎత్తరు. ఇటీవల ఓరోజు అతని వద్ద ఉన్న నీళ్లు అయిపోవడంతో.. దగ్గరలోని ‘పబ్లిక్ టాయిలెట్స్’ వద్దకు వెళ్లాడు. ఎంచక్కా టాయిలెట్‌లోని నల్లాకు పైపు పెట్టుకొని తన బండి మీదున్న స్టీల్‌డ్రమ్ము నింపుకున్నాడు.ఇతని ఘనకార్యాన్ని ఎవరో చూసి చక్కగా ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే, మరుగుదొడ్డి నీళ్లతో షర్బత్ తయారు చేసి విక్రయిస్తున్న వ్యవహారాన్ని అహ్మదాబాద్ మున్సిపల్ అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది. ‘ వామ్మో ఇలాంటి నీళ్ళతో చేసిన షర్బత్ తాగుతున్నామా మేము.. ఛఛ.. ’ ‘ వ్యాపారమే పరమావధి అనుకునేs ఇలాంటివాళ్ళ ఆగడాలను వెంటనే ఆపాలి.. ప్రజారోగ్యంతో ఆడుకుంటున్న వీళ్ళమీద కఠిన చర్యలు తీసుకోవాలి ’ అనే కామెంట్లు వినబడుతున్నాయి.