లక్ష దొరికాయి.. తిరిగి ఇచ్చేసింది.. మద్దెల లక్ష్మికి చప్పట్లు! - MicTv.in - Telugu News
mictv telugu

లక్ష దొరికాయి.. తిరిగి ఇచ్చేసింది.. మద్దెల లక్ష్మికి చప్పట్లు!

March 22, 2018

ఎవరికైనా అప్పనంగా ఓ లక్ష రూపాయలు దొరికితే ఏం చేస్తారూ.. చక్కా తీసుకొని అకౌంట్లో వేసుకుంటారు. లేదా ఖర్చు చేసుకొని ఎంజాయ్ చేస్తారు. కానీ అయ్యో ఇది ఎవరి సొమ్మో అని తిరిగి వాళ్ళకిచ్చేద్దామని ఎవ్వరూ అనుకోరు. చాలా అరుదుగా అలా అనుకునేవారు కొందరే వుంటారు. కొందరైతే నాకీ సొమ్ము రాసి పెట్టివుంది గనకే నాకు దొరికిందని సంబరపడి చంకలు గుద్దుకుంటారు. కానీ ఒకామె అలాంటి వారికి చెంపపెట్టులా నిలిచింది. ఆమె కష్టపడటంలో ఎంత నిజాయితీగా పని చేస్తుందో.. వ్యక్తిత్వంలో కూడా అంతే నిజాయితీని చూపించింది.

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి కూరగాయల మార్కెట్లో బల్దియా కార్మికురాలు మద్దెల లక్ష్మి. రోజూ మాదరిగానే ఆరోజు కూడా లక్ష్మి చెత్త ఊడుస్తుండగా నగదు ఉన్న ప్లాస్టిక్‌ కవరు దొరికింది. దీంతో ఆ కవరులో ఉన్న డబ్బులను ఆమె జాగ్రత్తగా దాచిపెట్టింది. ఉదయం చెత్తకుప్ప దగ్గర చికెన్ సెంటర్ యజమాని జావెద్ సంచి కోసం వెతుకుతున్నాడు. అక్ష రూపాయలు పోగొట్టుకున్న ఆందోళలనలో వున్నాడతడు. అది గమనించిన లక్ష్మి విషయం ఆరా తీసి తనకు దొరికిన డబ్బుల సంచీని అతనికి అప్పగించింది. లక్ష్మి నిజాయితీకి ముగ్దుడైన జావెద్ ఆమెకు రూ. 5వేలు బహుమానంగా ఇచ్చాడు.

చెత్తకుప్పలోకి లక్ష రూపాయలు ఎలా వచ్చాయి ?

మెట్‌పల్లి మార్కెట్‌ సమీపంలో జావేద్‌ చికెన్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి దుకాణం మూసేసి ఓ కవర్లో చెత్తను, మరో కవర్లో డబ్బులు తీసుకొని బయలుదేరాడు. చెత్తకుప్ప దగ్గరకొచ్చి చెత్త కవరుకు బదులు డబ్బులున్న కవరును చెత్తకుండీలో పారేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఉదయం లేచి డబ్బులు కోసం చూడగా కవర్లో చెత్త వుంది. ఒక్కసారిగా షాకయ్యాడు. హుటాహుటీన చెత్తకుప్ప దగ్గరకు చేరుకొని డబ్బుల కవర్ కోసం వెతకసాగాడు. ఆ కవర్ తనకు దొరికిందని లక్ష్మి ఆ కవరును అతనికి అప్పజెప్పేసరికి ఊపిరి పీల్చుకున్నాడు. లక్ష్మి నిజాయితీని మార్కెట్ వ్యాపారులందరూ ప్రశంసించారు.