ఆత్మహత్యకు ధైర్యం చాలలేదు… రైలు కింద చావు రుచి చూసొచ్చాడు… - MicTv.in - Telugu News
mictv telugu

ఆత్మహత్యకు ధైర్యం చాలలేదు… రైలు కింద చావు రుచి చూసొచ్చాడు…

November 22, 2018

చావడానికి చాలా ధైర్యం కావాలంటారు. ఆ ధైర్యంలో ఓ పదిపైసల వంతు బతకడం మీద పెడితే శుబ్బరంగా బతికేయొచ్చు. కానీ కొందరు అలా ఆలోచించరు. క్షణికావేశానికి లోనై తొందరపాటు నిర్ణయాలు తీసుకుని బంగారంలాంటి బతుకుని అర్థాంతరంగా ముగిస్తారు. అలాంటి వ్యక్తే ఈయన. కష్టం వచ్చింది కదా అని ఆత్మహత్యకు పూనుకున్నాడు. గుండెల నిండా ధైర్యంతో రైలు పట్టాల మీద పడుకున్నాడు. రైలు వస్తోంది.. ఇంతలో అతనిలో ధైర్యం సన్నగిల్లింది. భయంతో మధ్యలో లేచే ప్రయత్నం చేశాడు. రైలు కిందిభాగం తగలగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం… పలాస రైల్వేస్టేషన్‌ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది ఈ ఘటన. సోంపేట మండలం ఇసుకపాలెం గ్రామానికి చెందిన సింహాచలం పాత్రో(62) ఈ పనికి పూనుకున్నాడు.  Telugu news He did not have the courage to commit suicide ... he had tasted death under the train …ఇంట్లో రకరకాల వ్యక్తిగత సమస్యలు.. దీంతో సింహాచలం విసిగిపోయాడు. రైలుకింద పడి చనిపోదామని నిర్ణయించుకుని పలాస రైల్వేష్టేషన్‌ పరిధిలోని కాశీబుగ్గ రైల్వే ఎల్‌సీ గేటు వద్ద పట్టాలపైకొచ్చాడు. పట్టాలపై అడ్డంగా పడుకున్నాడు. అప్పుడే టాటా ఎక్స్‌ప్రెస్‌ రైలు పలాసకు వస్తోంది. రైలు మీద దూసుకొస్తున్న తన మృత్యువును చూసి అతనికి ఎక్కడలేని భయం కలిగింది. వెంటనే లేచే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనలో రైలు కిందిభాగం తగలగడంతో చేతులు, కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. అతను ఆత్మహత్య చేసుకుంటున్నాడని గ్రహించిన కొందరు ప్రయాణికులు రైలు చైన్ లాగారు. దీంతో రైలు ఆగింది. రైలు దిగిన కొందరు ప్రయాణికులు, గ్యాంగ్‌మెన్లు వెళ్లి గాయాల పాలైన సింహాచలాన్ని రైలు కింద నుంచి బయటకు తీశారు. చావు రుచి ఎలా వుంటుందో చూసినంత పనైంది సింహాచలానికి. స్థానికులు 108కు ఫోన్‌ చేయగా అందుబాటులో లేదని సమాచారం రావడంతో నొప్పితో విలవిల్లాడిపోయాడు అతడు. చాలాసేపటికి 108 అంబులెన్సు వచ్చింది. వెంటనే పలాస సామాజిక ఆసుపత్రికి తరలించారు. రైల్వేపోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.