పాపను, తల్లిని చంపాడు.. ఉరిశిక్ష వద్దని హైకోర్టుకు వెళ్ళాడు - MicTv.in - Telugu News
mictv telugu

పాపను, తల్లిని చంపాడు.. ఉరిశిక్ష వద్దని హైకోర్టుకు వెళ్ళాడు

April 12, 2018

తప్పులు చేసింది గాక వాటినుంచి తప్పించుకోవటానికి ఎత్తుగడలు వేయటం కొంత మంది నీచులకు అలవాటుగా మారింది. చట్టాలు అంటే వారికి జోక్ అయిపోయింది. ఎంత పెద్ద నేరం చేసినా చట్టాలను మభ్యపెట్టి ఈజీగా తప్పించుకోవచ్చు అని అనుకుంటున్నారు. చెన్నై శివారులోని కుండ్రత్తూరు సంబంధం నగర్‌కు చెందిన దశ్వంత్‌ (24) అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆరేళ్ళ పాపను అత్యాచారం చేసి సజీవంగా తగలబెట్టి చంపేసిన విషయం తెలిసిందే. పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. జైల్లోకి వెళ్ళిన కొన్నిరోజుల్లోనే బెయిల్ మీద దర్జాగా బయటకు వచ్చాడు.వచ్చి మంచివాడుగా మారతాడనుకుంటే మారలేదు సరికదా కన్నతల్లి సరళను హతమార్చి తన రాక్షసత్వాన్ని మరోమారు చాటుకున్నాడు. ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కన్నతల్లిని చంపేశాడు. మాంగాడు సమీపం మహాలింగం అపార్టుమెంటులో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న సమయంలో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిన విషయం తెలిసిందే. పరారీలో వున్న అతణ్ణి పోలీసులు ఎట్టకేలకు పట్టుకొని బోనులో నిలబెట్టారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన ఇతనికి ఉరి శిక్ష విధిస్తూ చెంగల్పట్టు మహిళా కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఇచ్చి నెలన్నర రోజుల అనంతరం దశ్వంత్‌ అప్పీలుకు సిద్ధం అయ్యాడు. బుధవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. తన పిటిషన్‌లో ఉరిశిక్షను వ్యతిరేకించాడు. మహిళా కోర్టు విచారణ సరిగ్గా లేదని, సాక్షుల వాంగ్మూలం నిజం కాదని, పోలీసులు సమర్పించిన ఆధారాలన్నీ తారుమారు అయ్యాయని పిటిషన్‌లో పేర్కొన్నాడు.

తనకు పడ్డ ఉరి శిక్షను రద్దు చేయాలని, సాక్ష్యాలు, ఆధారాలను సమగ్రంగా పరిశీలించి తుది తీర్పును ఇవ్వాలని దశ్వంత్‌ కోరాడు. అతను చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు పరిగణించింది. న్యాయమూర్తులు విమల, రామతిలగం నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ పిటిషన్‌ను పరిశీలించిన అనంతరం విచారణకు స్వీకరించింది.