చికెన్ పెట్టలేదని పొడిచి చంపేశాడు.. హైదరాబాద్‌లో ఘోరం - MicTv.in - Telugu News
mictv telugu

చికెన్ పెట్టలేదని పొడిచి చంపేశాడు.. హైదరాబాద్‌లో ఘోరం

April 2, 2018

పరువులు, ప్రతిష్ఠల కోసం హత్యలు చేస్తుండటం చూస్తున్నాం. కానీ వీళ్ళు మాత్రం కేవలం చికెన్ ముక్క కోసం ఒకర్ని హత్య చేశారు. శుభకార్యానికి వెళ్ళిన తమకు చికెన్ ముక్క వెయ్యలేదని సాటి మనిషిని దారుణంగా పొడిచిన ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలోని హుస్సేనీ ఆలం పోలీస్‌స్టేషన్ పరిధి షాగంజ్ ప్రాంతంలో జరిగింది. అశ్వాక్ అనే వ్యక్తి హరేహత్ మంజిల్ ఫంక్షన్ హాల్లో నిశ్చితార్థం వేడుకులకు వెళ్ళాడు. అక్కడ అన్వర్, అన్వర్ సోహైల్ అనే ఇద్దరు భోజనాలు వడ్డిస్తున్నారు.ఈ క్రమంలో తనకు చికెన్ వడ్డించలేదని  అశ్వాక్ అన్వర్‌తో గొడవకు దిగాడు. మాటా మాటా అనుకొని పెద్దది చేసుకున్నారు. అంతటితో ఊరుకోకుండా అశ్వాక్ తన స్నేహితులకు ఫోన్ చేసి విందు జరిగే ప్రాంతానికి రప్పించాడు. వాళ్ళంతా కలిసి అన్వర్‌పై విరుచుకుపడ్డారు. అశ్వాక్ మిత్రుల్లో ఒకరు అన్వర్ కడుపులో కత్తితో పొడిచాడు. అడ్డగించబోయిన అన్వర్ సోహైల్ వీపుపై కత్తితో పొడిచి వారంతా పారిపోయారు. గాయపడిన ఇద్దరినీ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అన్వర్ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.