ఈ అంధుడి విజయం.. నింపుతుంది ఆత్మస్థైర్యం! - MicTv.in - Telugu News
mictv telugu

ఈ అంధుడి విజయం.. నింపుతుంది ఆత్మస్థైర్యం!

March 1, 2018

శరీరానికి వైకల్యం వున్నా మనసుకు  వైకల్యం వుండకూడదు అంటారు. నిజమే మనసు వికలమైతే శరీర అవయవాలన్నీ బాగున్నా ఏమీ చెయ్యలేరు. మనోస్థైర్యం ఉన్నవారు శరీర వైకల్యాన్ని జయించి నలుగురికి అండగా నిలబడతారు. అలాంటి స్ఫూర్తివంతమైన కథ ప్రతీక్ అగర్వాల్‌ది. అంధత్వం అతనికి శాపం కాలేదు. దాన్నే వరంగా మార్చుకున్నాడు. అంధులకే కాదు అంగవైకల్యం కలవారెందరికో ఆదర్శంగా నిలిచాడు. అంతేకాదు నలుగురికి చెట్టంత ఆసరాగా నిలబడ్డాడు.

ప్రతీక్‌ది రాజస్థాన్‌లోని జైపూర్‌. అతను తన సాధక బాధకాల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. పుట్టుక నుండే అంధుడు అవటంవల్ల అతనికి అడుగు అడుగులో సవాలక్ష సవాళ్ళు ఎదురయ్యాయట. అయినా అలుపెరుగని పోరాటం చేశాడు. విజేతగా నిలబడ్డాడు. అతని విజయం వెనుక అతని తల్లి వుంది. తన తల్లి బ్రెయిలీ నేర్చుకొని కొడుకుకు ఇంటి దగ్గర టీచరమ్మ అయింది. చదువుకుందామని స్కూలుకు పోతే ఎవరూ స్కూల్లో జాయిన్ చేసుకోలేదు. చివ‌రికి జైపూర్‌లోని సెయింట్ మైకేల్స్ స్కూల్ ప్రిన్సిపాల్ తనను జాయిన్ చేసుకున్నారు.

చదువులో ఎప్పుడూ టాప్ 3 ర్యాంకర్స్‌లో ఒకడిగా వుండేవాడు ప్రతీక్. ఇంజనీరింగ్‌లో కూడా మంచి మార్కులు సాధించాడు.  ఎలాగోలా ఎన్నో తిప్పలు పడి చదువుకున్నాక అతనికి ఉద్యోగం ఎవరూ ఇవ్వలేదు. అంధ విద్యార్థిని మేము రిక్రూట్ చేసుకోమని చాలా కంపెనీలు ప్రతీక్‌ను రిజెక్ట్ చేశాయి. అయినా ఆశతో చాలా ఇంటర్వ్యూలు తిరిగాడు. ఎవరూ ఉద్యోగం ఇవ్వకపోయేసరికి ఇంటికొచ్చి ఏడ్చేవాడట. ఆ కన్నీళ్ళే అతనిలో పదే పదే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించసాగాయి.  ఇప్పుడతనే కొందరికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు.

 

కొంత కాలానికి స్నేహితుల స‌ల‌హాతో తనే సొంతంగా ` దైదాల్ టెక్నాల‌జీస్‌ `ను నెల‌కొల్పాడు. ప్రారంభంలో ఈ సంస్థ‌ను వృద్ధిలోకి తీసుకురావ‌డానికి ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు. ఎండలో ప్ర‌తీ సంస్థ వ‌ద్ద‌కు వెళ్లి సాఫ్ట్‌వేర్ వ‌ర్క్ ఏమైనా ఉందా? అని అడిగేవాడు. కొంత‌మంది పని ఇచ్చేవారు. కానీ, డ‌బ్బులు ఇచ్చేవారు కాదు. దాంతో లోక‌ల్ మార్కెట్ మీద ఆధార‌ప‌డ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకుని ఆన్‌లైన్ ద్వారా క్లైంట్ల‌ను క‌లుసుకున్నాడు. ఇప్పుడు ప్రతీక్ బిజినెస్‌లో 95 శాతం ఆన్‌లైన్ ద్వారానే జ‌రుగుతోంది. అత‌ని కంపెనీలో ఇప్పుడు 40 మంది ప‌నిచేస్తున్నారు. అత‌ని సంస్థ‌కు ప‌లు దేశాల్లో క్లైంట్లు ఉన్నారు. అయితే అత‌ను ఈ స్థాయికి చేరుకోవ‌డానికి అతను పడ్డ కష్టం కొండంత. ఎదిగిన వైనం చెట్టంత.