జైల్లో వుండి వీడియోకాల్‌లో మాట్లాడాడు - MicTv.in - Telugu News
mictv telugu

జైల్లో వుండి వీడియోకాల్‌లో మాట్లాడాడు

February 19, 2018

జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ తన మొబైల్ ఫోన్‌లో వీడియో కాల్ చేయటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన జోధ్‌పూర్‌లోని సెంట్రల్ జైల్లో జరిగింది. గత ఏడాది డిసెంబర్‌లో రాజస్థాన్‌కి చెందిన శంభూలాల్ అనే వ్యక్తి తన బంధువును ప్రేమించాడన్న కోపంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేస్తూ.. ఆ దారుణాన్ని తన బంధువుల చేతే వీడియో కూడా తీయించడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. కాగా ఆ హత్య కేసులో శంభూలాల్ జోధ్‌పూర్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.

ఆ వీడియో కాల్‌లో ‘ ఈ జైల్లో నా ప్రాణాలకు ముప్పు వుంది. హిందూ మహిళలను కించపరిస్తే నేను సహించలేను. నా జీవితాన్ని నేనే సర్వనాశనం చేసుకున్నాను. శిక్ష అనుభవిస్తున్నందుకు నాకెలాంటి బాధ లేదు. కానీ మీడియా వర్గాలు నేను తీసిన వీడియోలో ఉన్న మహిళకు నాకు వివాహేతర సంబంధం ఉన్నట్లు రాశారు. అదే నాకు చాలా బాధ కలిగించింది ’ అని శంభూలాల్‌ వీడియోలో తెలిపాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వచ్చాక పోలీసులు మేలుకున్నారు. దీనిపై హోంమంత్రి గులాబ్‌ చంద్‌ కటారియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ జైల్లో ఖైదీ చేతికి ఫోన్ ఎలా వచ్చింది ? ఓ ఖైదీ వీడియో కాల్‌లో మాట్లాడాడంటే సెంట్రల్ జైల్ తీరు ఎలా వుందో అర్థమవుతోంది. వెంటనే దీని మీద విచారణ చేపట్టాలి ’ అని ఆదేశించారు.