అమెజాన్‌కు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ. 52 లక్షల టోకరా 

మోసగాళ్ళు పెద్దపెద్ద పేరున్న సంస్థలను కూడా బురిడీ కొట్టిస్తున్నారు. అమెజాన్ వంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థేనే బోల్తా కొట్టిస్తున్నారు.  21 ఏళ్ల కుర్రాడి చేతిలో ఆ కంపెనీ ఘోరంగా మోసమోయింది.  అమెజాన్ వెబ్‌సైట్‌లో లొసుగులు పసిగట్టిన ఓ ఢిల్లీ కుర్రాడు రెండు నెలల వ్యవధిలో ఏకంగా 166 ఫోన్లు బుక్ చేసి, డెలివరీ చేసిన బాక్సులో ఫోన్ లేదని నమ్మించి డబ్బును రిఫండ్ చేయించుకున్నాడు. తాను కాజేసిన ఫోన్లను ఓఎల్ఎక్స్ వంటి వెబ్‌సైట్లలో పెట్టి అమ్మేశాడు. ఈ విధంగా అమెజాన్‌ నుంచి రూ.52 లక్షల మేర దోచేశాడు. నష్టాన్ని గమనించిన అమెజాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మనోడి బండారం బయటపడింది. ప్రస్తుతం లాకప్‌లో ఊచలు లెక్కబెడుతున్నాడు.

ఢిల్లీలోని ట్రై నగర్‌కు చెందిన శివమ్ చోప్రా(21) హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేశాడు. ఎక్కడ ఉద్యోగంలో చేరినా ఎక్కవ కాలం ఉండేవాడు కాదు. తొక్కలో ఉద్యోగం అని,  ఈజీమనీ కోసం స్కెచ్ వేశాడు. అమెజాన్‌కు గురి పెట్టాడు. తొలుత టెస్టింగ్ కోసం అమెజాన్‌లో రెండు ఫోన్లు ఆర్డర్ చేశాడు. అవి డెలివరీ అయిన తరవాత.. తనకు ఖాళీ డబ్బాలు మాత్రమే వచ్చాయని తిరిగి అమెజాన్‌కు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన అమెజాన్ నిబంధనల ప్రకారం ఫోన్ ధరకు సరిపోయే గిఫ్ట్ ఓచర్లను చోప్రాను పంపింది.

ఇంక చోప్రా ఆగకుండా ఐఫోన్, శాంసంగ్, వన్‌ప్లస్ వంటి ప్రీమియం ఫోన్లను వేర్వేరు అమెజాన్ అకౌంట్ల నుంచి బుక్‌చేశాడు.  కొత్త ఫోన్ బుక్‌చేసిన ప్రతిసారీ వేరు వేరు అడ్రస్‌లు మార్చి ఇచ్చేవాడు. తెలివిగా ఫోన్ నంబర్లు కూడా మార్చేవాడు. దీనికోసం లెక్కలేనన్ని సిమ్ కార్డులను శివమ్ కొనుగోలు చేశాడు. అమెజాన్ ఇచ్చిన గిఫ్ట్ కూపన్లతో ఫోన్‌లు బుక్ చేసేవాడు. ఆ తరవాత తాను నొక్కేసిన ఫోన్లను ఓఎల్ఎక్స్ వంటి వెబ్‌సైట్లలోనూ లేదంటే ఢిల్లీలోని ప్రముఖ గఫర్ మార్కెట్‌లోనూ అమ్మేసేవాడు. ఈ విధంగా మొత్తం 166 ఫోన్లను కొట్టేసి అమ్మేశాడు.

శివమ్‌కు సిమ్‌కార్డులు సరఫరా చేసిన స్థానిక టెలికామ్ స్టోర్ యజమాని సచిన్ జైన్‌ను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సిమ్‌కి రూ.150 చొప్పున తీసుకుని శివమ్‌కు సచిన్ 141 ప్రి యాక్టివేటెడ్ సిమ్‌లు సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. శివమ్ నుంచి 19 మొబైల్ ఫోన్లు, రూ. 12 లక్షల నగదు, 40 బ్యాంక్ పాస్‌బుక్‌లు, చెక్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అమెజాన్‌లో ఫోన్లు బుక్ చేయడానికి ‘ శుభమ్ ’ అనే పేరును శివమ్ చోప్రా వాడినట్లు పోలీసులు తెలిపారు. మొత్తానికి మూడు మోసాలు, ఆరు ఫ్రాడింగ్‌లతో పబ్బం గడుపేసుకుందామనుకున్న శివమ్ పని తుస్సుమన్నది.

SHARE