mictv telugu

బస్సు కింద పడబోయి బతికి బట్ట కట్టిన బుడతడు

May 1, 2018

భూమ్మీద నూకలు బాకీ వుండాలి గానీ గండాలను కూడా గడగడలాడించవచ్చు అంటారు పెద్దలు. కాకపోతే చైనాలో నూడుల్స్ ఎక్కువగా తింటారు కాబట్టి ఈ బుడతడికి నూడుల్స్ బాకీ వున్నట్టున్నాయని అనుకోవచ్చు. ఆయిశ్శును గట్టిగా రాసుకుని వచ్చిన ఈ చిన్నోడు బస్సు కింద పడబోయి కూడా ప్రాణాలతో బయటపడటం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ ఘటన చైనాలోని చోన్‌క్వింగ్‌లో చోటు చేసుకుంది.

ఆరేళ్ల ఓ చిన్నారిని పాఠశాల నుంచి ఇంటికి తీసుకెళుతోంది అతని తల్లి. అయితే, రోడ్డు పక్క ఫుట్‌పాత్‌పై నుంచే నడుచుకుంటూ వెళుతున్నారు.

ఈ క్రమంలో ఆ బాలుడు ఆడుకుంటూ పరుగెడుతూ వెళుతూ ఒక్కసారిగా గ్రిల్స్‌కు తగిలి అదుపుతప్పి బస్సు కింద పడబోయాడు. అదృష్టం బాగుండి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కాస్త అటూ ఇటైనా ఆ బాబు బస్సు చక్రాల కింద పడిపోయేవాడు. దీన్నే అంటారు జిందగీ అభీ బాకీ హై అని. కింద పడిపోయిన ఆ బాలుడిని అతడి తల్లి లేపి తీసుకెళ్లింది. స్పల్ప గాయాలతో ప్రాణాపాయం తప్పించుకున్న ఆ చిన్నారికి సంబంధించిన సీసీటీవీ వీడియో ఫుటేజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  క్రింది లింకులో మీరూ చూడొచ్చు.