శవాలపై చిల్లర ఏరుకునేవారే నయం - MicTv.in - Telugu News
mictv telugu

శవాలపై చిల్లర ఏరుకునేవారే నయం

March 3, 2018

బతికున్న మనుషులనే పీక్కుతినే నరహంతక సమాజంలో బతుకుతున్న మనుషులకు సాటి మనిషి కూడా చచ్చిన శవంతోనే లెక్క. ఇక శవాలు ఓ లెక్కా ?  అందుకే చచ్చిన శవాల దగ్గర కూడా లంచాలు గుంజుతున్నారు. బతికుండగా ప్రతీ పనికి లంచాలు చెల్లిస్తూ వచ్చిన మనిషి చివరికి తాను చచ్చిపోయి కూడా లంచం ఇవ్వాల్సిన దౌర్భాగ్యస్థితికొచ్చింది వ్యవస్థ అనటానికిది తాజా ఉదాహరణ ఇది. శవాల మీద చిల్లర ఏరుకున్నట్టు లంచాలకు ఎగబడుతున్న ఘటన వరంగల్‌లోని మహాత్మ గాంధీ ఆసుపత్రిలో యథేచ్ఛగా జరుగుతోంది. ప్రాణం పోయిన శవానికి పోస్టుమార్టం చేయటానికి డాక్టర్‌కు రూ. 500 తూచా తప్పకుండా ఇవ్వాల్సిందే. లేదంటే డాక్టర్ గారి కత్తి శవాన్ని కోయదు. డాక్టర్‌తో వుండే సిబ్బందికి కూడా రూ. 300 చెల్లించాలి. బాడీని కడిగినవారికి రూ. 1500 ముట్టజెప్పాలి. మార్చురీ నుండి బాడీని బయటకు తీసుకురావటానికి రూ. 200 ఇవ్వాలి. గేట్ కీపర్‌కు రూ. 100 ఇవ్వాల్సిందే. ఇలా లంచాలతో వారివారి చేతులు నాన్చాకనే బాడీని బంధువులకు అప్పగిస్తారు వరంగల్ ఎమ్‌జీఎమ్ ఆసుపత్రి మార్చురీ విభాగం.

‘ వీళ్ళకన్నా శవాలపై చిల్లర ఏరుకునేవారన్నా నయం ’ అని జనాలు తప్పదన్నట్టు వారికి లంచాలు ఇస్తున్నారు. అయినా వారందరికీ నెలకు జీతాలను ప్రభుత్వం చెల్లిస్తుండగా ఇంకా కక్కుర్తి ఎందుకని ఎవరు ప్రశ్నించినా వారు వినరు. మా యవ్వారం ఇంతే. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని పట్టనట్టు సమాధానం చెబుతుంటారు.