30 లక్షల మంది విద్యార్థులకు హెల్త్ కార్డ్‌లు! - MicTv.in - Telugu News
mictv telugu

30 లక్షల మంది విద్యార్థులకు హెల్త్ కార్డ్‌లు!

February 21, 2018

రానున్న విద్యా సంవత్సరం నుంచి  రాష్ట్రంలోని 30 లక్షల మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేసి హెల్త్ కార్డులు అందించాలని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టస్ సి. లక్ష్మారెడ్డిలు నిర్ణయించారు. జూలై నుంచి ఆరోగ్య పరీక్షలు ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేసి హెల్త్ కార్డులు ఇవ్వాలని అధికారులకు సూచించారు.

దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యాశాఖ గురుకుల విద్యాలయాలు, కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లోని దాదాపు 8 లక్షల మంది విద్యార్థినిలందరీకి హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే కేజీబీవీలు, గురుకుల విద్యాలయాలు, మోడల్ స్కూళ్లలోని 3 లక్షల మందికి విద్యాశాఖ హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందిస్తోందని వారు అన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాలయాల్లో చదివే 7,8,9,10 తరగతి విద్యార్థినిలందరికీ వారికి యుక్తవయస్సుల్లో వచ్చే ఆరోగ్య సమస్యలు, సంరక్షణపై కూడా అవగాహన తరగతులు నిర్వహించాలని కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలు సంయుక్తంగా నిర్ణయించారు. ఇందుకోసం వైద్యారోగ్య శాఖ తరపునుంచి విద్యాశాఖలోని కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, గురుకుల పాఠశాలలు, జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని మహిళా ఉపాధ్యాయులందరికీ శిక్షణ ఇవ్వాలని చెప్పారు.

అదేవిధంగా బాలికల్లో రక్తహీనత సమస్యను దూరం చేసే విధంగా ఇప్పటికే గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలలో అన్ని పోషకాహారాలందించే మెనును అమలు చేస్తున్నామని కడియం శ్రీహరి వివరించారు. మిగిలిన పాఠశాలల్లో కూడా విద్యార్థినులలో ఈ రక్తహీనతను అధిగమించే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆరోగ్య శాఖ సూచించాలని కోరారు.