అతనికి హైహీల్సే అందం, ఆత్మవిశ్వాసం - MicTv.in - Telugu News
mictv telugu

అతనికి హైహీల్సే అందం, ఆత్మవిశ్వాసం

March 13, 2018

సూటు వేసుకుంటే బూటు వేసుకోవటం తప్పనిసరి అని అందరికీ తెలిసిందే. మగాడి రూపానికి వన్నె తెచ్చే సూటుబూటు అంటే ఇష్టపడని మగాళ్ళు బహుశా ఎవరూ వుండరేమో. కానీ ఒకతను మాత్రం సూటు మీద బూటుకు బదులు హైహీల్స్ వేసుకుంటున్నాడు. అదేంటని ఆశ్చర్యపోకండి. అవంటే అతనికి ఎనలేని ప్రీతి. అతను ఎక్కడికి వెళ్ళినా హైహీల్స్ మాత్రమే ధరిస్తాడు.

ఇంతకీ ఈ మిస్టర్ డిఫరెంట్ పేరేంటో చెప్పలేదు కదూ. అతని పేరు ఆష్లే మ్యాక్స్‌వెల్. ఆస్ట్రేలియాలోని ఓ సంస్థలో ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్‌గా పనిచేస్తున్నాడు. అతడి వినూత్నమైన స్టైల్ చూసి చాలా మంది అలా కన్నార్పకుండా చూస్తుండిపోతారు. అమ్మాయిలు ఆశ్చర్యపోవటం.. అబ్బాయిలు వీడో తేడా అనుకోవటం ఖాయం. కానీ అతను డిఫరెంట్. తేడా కానేకాదు. అతని ఇంట్లో వివిధ సూట్ల మీదకు మ్యాచ్ అయ్యే రకరకాల హైహీల్స్ వుంటాయి. ఈ రోజుల్లో అమ్మాయిలు ధరించేవన్నీ అబ్బాయిలు ధరిస్తున్నారు. కానీ హైహీల్స్ మాత్రం ఇంత వరకు ఎవరూ ధరించలేరు. ఆ రికార్డును ఆష్టే సొంతం చేసుకున్నాడు.ఇంతకీ అతను హీల్స్ వేసుకోవటానికి గల కారణాన్ని కొందరు అడిగి తెలుసుకుని ఆశ్చర్యపోవటం వారి వంతు అయింది. హీల్స్ వేసుకున్నప్పటి నుంచి తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పటంతో ‘ ఏంటీ హీల్స్ వేసుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుందా ? ఇదేం విడ్డూరం ?’ అనుకున్నారట. తాను హీల్స్‌కు అలవాటు పడకముందు ఎంతో నిరుత్సాహంగా వుండేవాడని తెలిపాడు. జీవితం చచ్చుబడినట్టు వుండేదట. ఆత్మవిశ్వాసం పెరగాలంటే ఏం చెయ్యాలని చాలా మంది స్నేహితులను, మనస్తత్వ నిపుణులను,  వాళ్ళను, వీళ్ళను అడిగేవాడంట. ఈ క్రమంలో ఎవరికి తోచిన సలాహా వారిచ్చేవారట.

కానీ తన స్నేహితురాలు మాత్రం తనలో ఆత్మవిశ్వాసాన్ని కేవలం హీల్స్ మాత్రమే పెంచాయని చెప్పిందట. హీల్సా అని ఇతను కూడా ఆశ్చర్యం ప్రదర్శించాడట ? అందుకామె నవ్వేసి నువ్వు కూడా ఒకసారి ప్రయత్నించమని చెప్పిందట. ఆమె చెప్పినట్టే హైహీల్స్ వేసుకొని నడవటం ప్రాక్టీస్ చేసిన ఆష్టే నిజంగానే వాటిలో ఏదో పవర్ వుందని నమ్మటం మొదలు పెట్టాడు. అలా అతని జీవితంలో హీల్స్ ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ఆత్మవిశ్వాసం కావాలనుకున్నవాళ్ళు ఇలా డిఫరెంటుగా ప్రయత్నించవచ్చు.