నోట్లన్నీ దాచి పెట్టుకోండి తర్వాత చూద్దాం.. - MicTv.in - Telugu News
mictv telugu

నోట్లన్నీ దాచి పెట్టుకోండి తర్వాత చూద్దాం..

March 22, 2018

కొత్త నోట్ల ప్రహసనం మొదలై అప్పుడే ఏడాదిన్నర కావస్తోంది. ఈ కొత్త నోట్లతో ఇప్పుడు జనాలకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. నోట్లు కలర్ వెలిసిపోయినా, కాస్త చిరిగినట్టున్నా ఆ నోట్లను ససేమిరా తీసుకోమని బ్యాంకులు చక్కా చెప్పేస్తున్నాయి. దీంతో జనాలకు ఏం చెయ్యాలో దిక్కుతోచక సతమతమవుతున్న పరిస్థితి నెలకొనివుంది ? రంగురంగుల నోట్లు వచ్చి కరెన్జీ లుక్ సాంతం మారిపోయింది. మోడీ సర్కార్ పుణ్యమా అని బ్లాక్ మనీ సంగతి అటుంచితే సాధారణ జనాలు ఎక్కడలేని ఇబ్బందులకు గురి అవుతున్నారు. పెద్దనోట్లకు చిల్లర దొరక్క ఓవైపు, ఏటీఎంలలో డబ్బులు లేక మరోవైపు నానారకాల ఇబ్బందులు పడ్డారు.ఇప్పుడు కొత్తగా చిరిగిన నోట్లు తీసుకోమంటున్నారు బ్యాంకులవాళ్ళు. ఆ నోట్లన్నీ అలా అట్టిపెట్టుకోండి.. తర్వాత చూద్దాం అని చావు కబురు చల్లగా చెప్పినట్టు చెప్పేస్తుండటంతో జనాలు ఆ నోట్లను చూస్తూ తలలు పట్టుకుంటున్నారు. అంతేకాదు ఆర్బీఐకి వెళ్లి అష్టకష్టాలు పడినా సరే తీసుకునే పరిస్థితులే లేవు. దీన్నే అదనుగా తీసుకుంటున్న కొందరు.. చిరిగిన నోట్లను తీసుకుంటామని చెప్పి  భారీగా కమీషన్ల దందాకు తెరలేపుతున్నారు. బ్యాంకులకు సమీపంలో తమ పని కానిచ్చేస్తున్నారు. రూ.2 వేల చిరిగిన నోటుకు రూ.500 నుంచి 1,000 వరకు కమీషన్ తీసుకుంటున్నారు. చిరిగిన రూ.500నోటు మార్పిడికి రూ.200 నుంచి 300 వరకు కమీషన్‌గా తీసుకుంటున్నారు.

చిరిగిన నోట్లను ఎందుకు తీసుకోరని బ్యాంకులవాళ్ళను ప్రశ్నిస్తే.. రిజర్వ్ బ్యాంక్ నుంచి మాకు ఆదేశాలు వున్నాయని చెప్పేస్తున్నారు. కొత్త నోట్లకు సంబంధించి చిరిగిన/దెబ్బతిన్న కొత్త నోట్ల మార్పిడికి మార్గదర్శకాలు ఇప్పటికీ రాలేదని రిజర్వ్ బ్యాంక్ వాదన. దీంతో ఒక వేళ చిరిగిన నోట్లు బ్యాంకులు తీసుకున్నా.. వాటిని కూడా కౌంటింగ్‌‌లో లెక్కలు తేల్చాల్సిందే. ఈ మేరకు మార్గదర్శకాలు లేకపోవడంతో వాటిని తీసుకోవడం లేదని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. అయితే బ్యాంకుల నుంచి సొమ్ము డ్రా చేసుకున్నప్పుడు, ఏటీఎంలలో మాత్రం చిరిగిన కొత్త నోట్లు వచ్చినా కష్టమే. వాటిని తిరిగి బ్యాంకుల వద్దకు తీసుకెళ్లినా వాళ్ళు సంబంధం లేనట్టు సమాధానం చెప్తున్నారు. దీంతో తీవ్ర నిరాశతో.. అత్యవసరానికి డబ్బులు లేక దేశవ్యాప్తంగా జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.