ఏపీ హిజ్రాలకు శుభవార్త.. రూ. 1000 పింఛను.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ హిజ్రాలకు శుభవార్త.. రూ. 1000 పింఛను..

November 27, 2017

హిజ్రాలు తమ హక్కుల కోసం పోరాడుతున్న నేపథ్యంలో  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  స్పందించింది. వారికి  నెలకు రూ. 1000 ఫింఛను ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు  ప్రకటించారు. దీనిపై హిజ్రాలు హర్షం  వ్యక్తం చేస్తున్నారు.  

తమ ప్రభుత్వం చేపట్టనున్న సంక్షేమ పథకాల గురించి సోమవారం అసెంబ్లీలో ప్రజా సంక్షేమంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో బాబు ప్రసంగించారు. ‘2018 సంవత్సరంలో రాష్ట్రమంతటా అన్న క్యాంటీన్లు అమలులోకి తీసుకొస్తాం. అలాగే ‘చంద్రన్న భీమా పథకం ’ కింద 2.53 కోట్ల మంది పేదలకు భీమా అమలు చేస్తాం. దీని ద్వారా సహజ మరణమైనా రూ.2లక్షల పరిహారం ఇస్తాం.  ఏ రాష్టంలోనూ ఇవ్వని విధంగా 24 గంటల విద్యుత్తు ఇస్తున్నాం. భవిష్యత్తులో విద్యుత్ చార్జీలు పెంచం. ఇప్పటికే రూ.474 కోట్ల వ్యయంతో 29లక్షల వంటగ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చాం.  ప్రతీ ఇంటికీ గ్యాస్‌ కనెక్షన్‌ ఇస్తామని ‘ కుటుంబ వికాసంలో ’ చెప్పాం’ అని తెలిపారు.

జనవరి 1 నుంచి పెళ్లికానుక

వచ్చే ఏడాది జనవరి 1 నుండి పేదింటి అమ్మాయి పెళ్ళిళ్ళకు ‘ పెళ్లి కానుక ’ పథకం పేరిట ఆర్థిక సాయం చేస్తామన్నారు. ‘ఈ పథకంలో భాగంగా పెళ్లికి ముందు 20 శాతం, పెళ్లి రోజు మిగతా 80శాతం ఆయా వర్గాలకు కేటాయించిన ప్రకారం మొత్తాన్ని అందజేస్తాం ’ అని  ప్రకటించారు.

రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం పూర్తిచేశాకే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. అన్న అమృత హస్తం పథకంపై పై 85 శాతం సంతృప్తి వ్యక్తమైందన్నారు. చివరిగా ప్రతి కుటుంబానికి రూ. 10వేల ఆదాయం వచ్చేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.