క్రైస్తవ పాఠశాలలకు హిందూ జాగరణ్ మంచ్ హెచ్చరికలు.. - MicTv.in - Telugu News
mictv telugu

క్రైస్తవ పాఠశాలలకు హిందూ జాగరణ్ మంచ్ హెచ్చరికలు..

December 19, 2017

క్రైస్తవ పాఠశాలల్లో క్రిస్మస్ పండుగ సంబరాలు జరపకూడదంటూ హిందూ జాగరణ్‌ మంచ్ హెచ్చరికలు జారీ చేసింది. మెజారిటీ హిందూ విద్యార్థులు చదువుతున్న క్రైస్తవ పాఠశాలల్లో క్రిస్మస్ పండుగ నిర్వహించకూడదని, ఇటువంటి సంబరాలు క్రైస్తవ మతాన్ని విస్తరించేందుకు పన్నుతున్న కుట్ర అని హిందూ జాగరణ్ మంచ్ ఆగ్రా నగర అధ్యక్షుడు సోనుసవిత ఆరోపించారు. క్రిస్టియన్ పాఠశాలల్లో క్రిస్మస్ సందర్భంగా హిందూ విద్యార్థులతో ఇలాంటి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించకుండా విద్యార్థుల తల్లిదండ్రుల సంఘాలు, క్రిస్టియన్ పాఠశాలల నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని కోరుతూ తాము లేఖలు రాశామని సోనుసవిత పేర్కొన్నారు. తాము చెప్పిన ఆదేశాలను పాటించకుంటే విద్యాసంస్థల ముందు నిరసనలు చేస్తామని హెచ్చరించారు. కాగా తాము విద్యార్థులెవరినీ క్రిస్మస్ వేడుక నిర్వహించమని కోరడం లేదని ఇన్‌గ్రహం పాఠశాల డైరెక్టర్ ఎస్. ఎన్. సింగ్ చెప్పారు. హిందూ జాగరణ్ మంచ్ హెచ్చరికలతో వారి క్రిస్మస్ వేడుకలకు పోలీసు భద్రత కావాలని కోరినట్టు తెలుస్తోంది.