హోళీ ఏడాదికి ఒక్కసారే.. నమాజు రోజూ ఉండేదే.. యోగి - MicTv.in - Telugu News
mictv telugu

హోళీ ఏడాదికి ఒక్కసారే.. నమాజు రోజూ ఉండేదే.. యోగి

March 5, 2018

‘సంవత్సరంలో హోళీ పండగ ఒక్కసారి మాత్రమే వస్తుంది. దాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. నమాజ్ ప్రతి రోజూ ఉంటుంది.. దాన్ని చాలాసార్లు చదువుతూనే ఉంటారు ’ అంటూ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 11న ఉప ఎన్నికలు జరగనున్న ఫుల్‌పూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం పర్యటిస్తున్న ఆయన, ఓ ర్యాలీలో మాట్లాడారు. నమాజ్‌కు, హోళీకి లింకు ఎందుకు పెట్టారోననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదిత్యనాథ్ ఇలా మాట్లాడటం మత ఉద్రిక్తతలను పెంచుతుందని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.గతంలో యూపీలో హోళీ పండగ జరిగిన సందర్భంలో నమాజ్‌కు వెళ్లేవారి మీద రంగులు చల్లటంతో వారి మధ్య మత ఘర్షణలు జరిగాయి. ఈ సంవత్సరం అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు విజ్ఞప్తి నేపథ్యంలో సున్నిత ప్రాంతాల్లో శుక్రవారం నమాజ్ సమయాన్ని 30 నిమిషాల నుంచి గంట వరకు వాయిదా వేశారు. ఈ నిర్ణయాన్ని లక్షలాది మంది ప్రజలు స్వాగతించారు కూడా. దీనిపై యోగి చేసిన వ్యాఖ్యలు దూమారాన్ని రేపుతున్నాయి.