అమ్మకానికి హార్లిక్స్.. జస్ట్ రూ. 25వేల కోట్లే - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మకానికి హార్లిక్స్.. జస్ట్ రూ. 25వేల కోట్లే

March 28, 2018

హార్లిక్స్ అంటే తెలియకుండా పెరగని పిల్లలు ఉండరు. దశాబ్దాలుగా మార్కెట్లో భారతీయుల మనసు దోచుకుంది ఆ బ్రాండ్. మొదటి ప్రపంచయుద్ధం జరిగిన సమయంలో బ్రిటన్ ఆర్మీకి మరింత శక్తి కోసం హార్లిక్స్‌ను తీసుకువచ్చారు. దీన్ని విక్రయించాలని గ్లాక్సో స్మిత్ (జీఎస్‌కే) భావిస్తోంది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ హెల్త్‌కేర్‌ సంస్థ గ్లాక్సో స్మిత్‌ క్లిన్‌(జీఎస్‌కే) కొన్ని హార్లిక్స్‌ బ్రాండ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.  హెల్త్‌కేర్‌పై పూర్తిగా దృష్టిపెట్టేందుకు హార్లిక్స్‌ బ్రాండ్‌ను అమ్మేస్తున్నట్లు తెలుస్తోంది. హార్లిక్స్‌ను కొనుగోలు చేసేందుకు ప్రముఖ సంస్థలు యునిలివర్‌ , నెస్లే, క్రాఫ్ట్‌ హీన్‌  వంటి సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. భారత్‌లో జీఎస్‌కే లాభాల్లో అధిక వాటా హార్లిక్స్‌దే. ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం.. జీఎస్‌కేలో హార్లిక్స్‌ వాటా విలువ 3.1బిలియన్‌ డాలర్లకు పైమాటే. ఇటీవల జీఎస్‌కే నోవార్టీస్‌లో వాటా కొనుగోలు చేసింది. ఇందులో పెట్టుబడుల కోసం హార్లిక్స్‌, ఇతర పోషక ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు సమాచారం.

ఈ విక్రయం ద్వారా దాదాపు 4 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.25వేల కోట్లు)  వస్తాయని సంస్థ భావిస్తోంది. ఈ మొత్తంపై అధిక ప్రీమియంను ఆఫర్ చేసే సంస్థకు హార్లిక్స్ బ్రాండ్‌ను అప్పగించాలని జీఎస్కే భావిస్తున్నట్టు సమాచారం. ఇదిలావుండగా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న నెస్లే, హార్లిక్స్‌తో చర్చలు జరిగాయన్నదాని మీద అధికారికంగా స్పందించలేదు. అన్నీ కుదిరితే హార్లిక్స్ కొత్త యజమాని ఆధ్వర్యంలో ఇలాగే భారతీయుల మనసు దోచుకుంటుందో లేదో చూడాలంటున్నారు హార్లిక్స్ ప్రియులు.