ఎంత అమానుషం.. బీడీల కోసం నడిరోడ్డు మీద భార్యను కొట్టాడు - MicTv.in - Telugu News
mictv telugu

ఎంత అమానుషం.. బీడీల కోసం నడిరోడ్డు మీద భార్యను కొట్టాడు

April 23, 2018

కేవలం తను బీడీలు తాగటానికి భార్య డబ్బులు ఇవ్వలేదని భార్యను నడిరోడ్డు మీద గొడ్డును బాదినట్టు బాదాడు. ఆమె ఒంటి మీదున్న బట్టలు చించి అతి కిరాతకంగా ఆమె జుట్టు పట్టుకుని బైకు వరకు ఈడ్చుకెళ్ళాడు. అయినా ఆ భార్య అతణ్ణి పెద్ద మనసుతో క్షమించింది. ఆడవారిని క్షమయా ధరిత్రి అని ఇందుకే అంటారేమో. భర్త చేస్తున్న అకృత్యాలను క్షమిస్తుంది భార్య కానీ.. భార్య ప్రాణం కన్నా ఎక్కువగా తనను ప్రేమిస్తున్నా భర్త దండిస్తాడు.. ఇదెక్కడి న్యాయం అనటానికి ఈ ఘటన నిదర్శనంగా నిలబడుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఈ ఘటన రాజస్థాన్‌లోని జైసల్మీర్‌ జిల్లా భూ గ్రామంలో మూడు రోజుల క్రితం జరిగింది. బాధిత మహిళ కూలీ పని చేసి రూ.2000 సంపాదిస్తుంది. బీడీలకు అలవాటు పడ్డ భర్త ఆమెను నిత్యం డబ్బుల కోసం వేధించేవాడు. ఆరోజు బీడీల కోసం అతడు ఆమెను డబ్బివ్వాల్సిందిగా డిమాండ్ చేశాడని, అందుకు ఆమె నిరాకరించడంతో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. దీంతో ఆమె తన పుట్టింటికి వెళుతున్న క్రమంలోనే అడ్డగించాడు అతడు. ఆమెను తన బైకుపై ఎక్కాల్సిందిగా అడిగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అంతేగాకుండా ఆమె బట్టలను చించేసి ఆమె గౌరవానికి భంగం కలిగించాడు. ఆ తతంగాన్నంతా అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ ఫోన్లలో వీడియో తీశారే తప్ప ఆ గొడవను ఆపే ప్రయత్నం చేయలేదు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. జిల్లా ఎస్పీ స్పందించారు. అది నిజమేనని తేల్చారు.

కాగా, అతడిపై కేసు నమోదుకు బాధిత మహిళ నిరాకరించింది. ఆమె సోదరుడు వచ్చి తమ ఇంటికి తీసుకెళ్లాడు. అయితే పోలీసుల విచారణలో ఆమెను కొట్టిన భర్త మైనర్ అని తేలింది. అతని వయసు 15 సంవత్సరాలట. భార్య వయసు 20 సంవత్సరాలు. ఇద్దరికీ వయసులో ఐదేళ్ళ తేడా వున్నప్పటికీ వారిద్దరికీ చిన్నప్పుడే పెళ్ళి జరిగిందట. అంటే వారిది బాల్య వివాహం అని పోలీసులు తేల్చారు. కాగా ఇలాంటి చర్యలపై అతడికి వార్నింగ్ ఇచ్చారు. అతడిని శిశు సంరక్షణ కమిటీకి అప్పగించారు.