య్యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి వెళ్లటం ఎలా? - MicTv.in - Telugu News
mictv telugu

య్యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి వెళ్లటం ఎలా?

November 21, 2017

మీరు య్యూట్యూబ్‌లో  ట్రెండింగ్‌లోకి వెళ్లాలనుకుంటున్నారా? ఒక్కరోజులో వేలు, లక్షల వ్యూస్ కావాలనుకుంటున్నారా?నాలుగు గంటల్లో నలుగురి నోట్లో నానాలనుకుంటున్నారా? అయితే చాలా సులభం, ఎలా అనుకుంటున్నారా? ఇంకేంటి మూడు గాసిప్పులు, ఆరు అవద్దపు వార్తలకు మసాలా దట్టించి, కల్పించి,జొప్పించి, మీ చాతుర్యాన్ని,పైత్యాన్ని చూపిస్తే సరి. లారీల కొద్ది లైకులు, లెక్కవెట్టలేనన్ని వ్యూస్, సంచులల్ల వట్టనన్ని కామెంట్లు మీ సొంతం.ఇప్పుడిదే య్యూట్యూబ్‌లో నడుస్తున్న ట్రెండ్. పైన పటారం, లోన లొటారం అన్నట్టు.. మీద మాంచి క్యూరియాసిటి ఉన్న టైటిల్ పెడితే చాలు, ఉదాహరణకు ‘ఆ హీరోయిన్ అర్థరాత్రి హీరో గదిలో ఏం చేస్తుంది’ ‘ఈ హీరోయిన్ ఇంత పనిచేస్తుందనుకోలేదు’ ‘ఆ హీరో ఇంట్లో ఎలా ఉంటాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు’ లోపట ఏం జెప్తరో, ఏం సూపిస్తరో మీ ఇష్టం. మీద టైటిల్ ఒకటి, లోపట మ్యాటర్ ఒకటి ఉంటే, కామెంట్ల రూపంల బొచ్చెడు తిట్ల దండకాలు వస్తయ్, అవేమి పట్టిచ్చుకోవద్దు, మరి ట్రెండింగ్‌లోకి వెళ్లాలంటే గా మాత్రం ఓర్సుకోవాలె గదా. ఇయ్యాల రేపు మంచి జెప్తె ఎవ్వలింటరు శెప్పున్రి. నాలుగు గాసిప్పులు, ఆరు మసాలా వార్తలు ఇవే నేడు పబ్లిక్కు కావలసినవి. అందుకే అందరూ మూడు బూతులు, నాలుగు వెకిలి చేష్టలతో కామెడీ అంటే ఇదే అన్నట్టు, అన్ని అవద్దపు ముచ్చట్లను య్యూట్యూబ్‌లో పెడుతూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నరు. వీళ్లు జేస్తనే ఉన్నరు, జనాలు జూస్తనే ఉన్నరు. అందుకే  మంచి వీడియోలకు వందల్లో రాని వ్యూస్, అదే ఓ మసాలా వార్తకు లక్షల్లో వస్తున్నాయ్.