నాన్నకు క్యాన్సర్… హృతిక్ రోషన్ - MicTv.in - Telugu News
mictv telugu

నాన్నకు క్యాన్సర్… హృతిక్ రోషన్

January 8, 2019

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత, హీరో హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్‌కు క్యాన్సర్ వ్యాధి సోకిందట. ఈ విషయాన్ని హృతిక్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. తండ్రి ఫోటోతో సహా పోస్ట్ పెట్టారు. ‘ఈరోజు ఫోటో దిగాలనుందని నాన్నను అడిగాను. కొన్ని వారాలుగా ఆయన గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. నాకు తెలిసినంత వరకు ఆయన చాలా దృఢమైన వ్యక్తి. క్యాన్సర్‌తో పోరాడుతూనే సంతోషంగా జీవిస్తున్నారు. శస్త్రచికిత్స రోజు కూడా ఆయన జిమ్‌కు రావడం మానరని తెలుసు. కుటుంబంలో ఆయనలాంటి లీడర్‌ ఉన్నందుకు మేమెంతో అదృష్టవంతులం…లవ్యూ డ్యాడ్‌’ అని తెలిపాడు హృతిక్.

ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపట్లోనే 6 లక్షల లైక్‌లు వచ్చాయి. అభిమానులంతా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. ‘క్రిష్’ సినిమా పేరెత్తగానే అందులో హీరోగా హృతిక్ రోషన్ దర్శకుడిగా రాకేష్ రోషన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తాయి. కొడుకును హీరోగా నిలబెట్టే క్రమంలో తెరవెనుక ఆయన పోషించిన పాత్ర అమోఘమైంది. హృతిక్‌ నటించిన దాదాపు అన్ని చిత్రాలకు రాకేశ్‌ నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా ఆయన క్రిష్4 సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇంతలో ఆయనకు క్యాన్సర్ అని తేలింది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరన్నట్టు క్యాన్సర్ బారిన పడటం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. మనీషా కోయిరాల, సోనాలీ బింద్రే క్యాన్సర్ బారినపడి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మరో సీనియర్ నటుడు రిషి కపూర్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని సమాచారం.Telugu news Hrithik Shares Pic Of Rakesh Roshan, Diagnosed With Throat Cancer, From ‘Gym On Surgery Day’