ఎస్ఐటీ, ఐఐటీ, ఐఐఎస్ఈఆర్ చదవుతున్న మెరిట్ విద్యార్థులు ఇక నుంచి నెలకు రూ. 70 వేల నుంచి రూ. 80 వేల వరకు స్కాలర్షిప్ పొందనున్నారు. ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోషిప్ కింద ఈ స్కాలర్షిప్ పొందనున్నారు. బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రకటించడంతోపాటు కేబినెట్ ఆమోదం తెలిపిందని మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. పీఎం రీసెర్చ్ ఫెలోషిప్‌లో భాగంగా ఏటా వెయ్యి మందికి స్కాలర్షిప్లు అందిస్తారు.
ఎంపిక చేసిన స్కాలర్లకు ఏటా రూ. 2 లక్షల చొప్పున రీసెర్చ్ గ్రాంట్లను అందించనున్నారు. భారీగా స్కాలర్షిప్లను అందించడమే కాకుండా.. ఐఐటీలు, ఐఐఎస్సీల్లో పరిశోధనా సదుపాయాలు మెరుగు పరచనున్నారు. అలాగే ఐఐఎస్ఈఆర్, ఐఐటీలు, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో చదువుతూ.. పీఎంఆర్ఎఫ్ కోసం ఎంపికైన విద్యార్థులు, ఐఐటీలు లేదా బెంగళూరులోని ఐఐఎస్సీలో నేరుగా పీహెచ్‌డీలో చేరేందుకు అర్హత పొందుతారు. పీఎంఆర్ఎఫ్ కోసం ఎంపిక కావడానికి విద్యార్థులు కనీసం 8.5 సీజీపీఏ సాధించాల్సి ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఈ పథకం అమల్లోకి వస్తోంది.