పిలిస్తే పలకలేదని  భార్యను చంపేశాడు - MicTv.in - Telugu News
mictv telugu

పిలిస్తే పలకలేదని  భార్యను చంపేశాడు

November 1, 2017

వికారాబాద్ జిల్లాలో తాండూర్‌కు చెందిన లారీ డ్రైవర్ శ్రీనివాస్.. పిలిస్తే పలకలేదని  కట్టుకున్న భార్యనే  చావగొట్టి చంపేశాడు.  దీపావళి పండుగకు పుట్టింటికి వెళ్లిన శ్రీనివాస్ భార్య  అనిత,  అక్టోబర్‌ 22న  అత్తారింటికి ఆటోలో బయల్దేరింది.  ఈ సమయంలో తాండూర్ పట్టణంలోని వల్లభాయ్‌ పటేల్‌ కూడలి వద్ద ఉన్న శ్రీనివాస్‌, ఆమెను గమనించి పిలిచాడు.  

వాహనాల శబ్దాల వల్ల, వినిపించకపోవడంతో ఆమె పలకలేదు. దీంతో కోపంతో ఇంటికి వెళ్లిన శ్రీనివాస్‌, పారతో భార్య కాళ్లు, చేతులపై బలంగా కొట్టాడు.  తీవ్రంగా గాయపడిన ఆమెను  కుటుంబ సభ్యులు  ఆసుపత్రికి తరలించారు. కాళ్లు చేతులు విరిగిపోవటంతో పరిస్థితి విషమంగా ఉందని, హైదరాబాద్‌ తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు.

హైదరాబాద్‌ తీసుకెళ్లకుండా భర్త శ్రీనివాస్, ఆయన కుటుంబ సభ్యులు స్థానికంగా నాటువైద్యం చేయించారు. పరిస్థితి విషమించడంతో అనిత చనిపోయింది.  భార్య చనిపోయిన వెంటనే  శ్రీనివాస్  అక్కడినుంచి పరారయ్యాడు. శ్రీనివాస్ పై హత్యకేసు నమోదు చేసిన పోలీసులు  అతనికోసం గాలిస్తున్నారు.