మెట్రో స్టేషన్లకు మీ పేరూ పెట్టుకోవచ్చు! - MicTv.in - Telugu News
mictv telugu

మెట్రో స్టేషన్లకు మీ పేరూ పెట్టుకోవచ్చు!

February 16, 2018

హైద్రాబాద్‌లోని  మెట్రో స్టేషన్ల పేర్లు మారబోతున్నాయి. ఎవరు ఎక్కువ పైసలు పెట్టి కొనుక్కుంటే వారి పేరునే  పెట్టడానికి  మెట్రో  నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ  నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే  బేగంపేటలోని ప్రకాశ్ నగర్‌లోని మెట్రో స్టేషన్ కు ఇన్వెస్కో అని ఓ అంతర్జాతీయ కంపెనీ  పేరును  పెట్టారు. అంతేకాదు మిగతా మెట్రో స్టేషన్ల పేర్లను  ఎవరైనా కొనుక్కుంటే వాటిని కూడా మారుస్తామని వారు స్పష్టం చేశారు.

ఒక్క స్టేషన్ పేరే కాదు  మెట్రో పిల్లర్లు మొదలుకొని, మెట్రో స్టేషన్‌ లోపల ప్లాట్‌ఫామ్‌, మెట్రో రైల్‌ కోచ్‌లు, వాటి లోపలి భాగాలు, స్టేషన్‌లపై సెల్‌ టవర్‌ల ఏర్పాటు  ఇలా ఎవరైనా డబ్బులు పెట్టి కొనుక్కుంటే అమ్మేందుకు మెట్రో సంస్థ అధికారులు సిద్దమయ్యారు.

 అయితే  ప్రాంతాన్ని బట్టి మెట్రో స్టేషన్లకు పేర్లను ఏర్పాటు చేశారు.  ఇప్పుడు  కొత్తగా ప్రైవేటు కంపెనీల పేర్లు పెట్టడం వల్ల  ప్రజల్లో అయోమయం నెలకొంటుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఆదాయంకోసం ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టిన మెట్రో ప్రాజెక్టులో నిర్మాణ సంస్థ సొంత నిర్ణయాలు అమలు చేస్తోందని కొందరు మండిపడుతున్నారు. మెట్రో సంస్థ అధికారులకు  ప్రతీది ఓ వ్యాపారం అయిపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి.