ఇంగ్లిష్ చదువు ఓ నిండుప్రాణాన్ని బలితీసుకుంది. టీచర్లు గ్రామీణ విద్యార్థులకు ఇంగ్లిష్‌పై భయాన్ని పోగొట్టలేకపోతున్నారు. కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్న కోర్టుల ఆదేశాలు బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. ఆంగ్ల మాధ్యమంలో పాఠాలు అర్థం కావడం లేదన్న ఆవేదనతో ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సూర్యాపేట జిల్లా మునగాల గ్రామానికి చెందిన మురళికృష్ణ(21) హైదాబాద్‌లోని ఓ కాలేజీలో హోటల్మెనేజ్మెంట్ కోర్సు చదువుతున్నాడు. తెలుగు మీడియంలో డిగ్రీ చదివిన మురళి తన స్నేహితులతో కలిసి దోమల్‌గూడ ప్రాంతంలో రూమ్‌లో ఉంటున్నాడు.మెనేజ్మెంట్ కోర్సులోని పాఠాలన్నీ ఇంగ్లీష్ మీడియంలో ఉండడంతో అర్ధంకాక తీవ్ర ఇబ్బంది పడ్డాడు.
ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన మురళీకృష్ణ గురువారం గదిలోఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత గదికి వచ్చిన స్నేహితులు షాక్ అయ్యి, వెంటనే పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేశారు. తనకు ఇంగ్లీష్‌లో పాఠాలు అర్థం కాకపోవడం వల్లే అత్మహత్య చేసుకుంటున్నట్లు మురళి సూసైడ్ నోట్ రాశాడు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.