హైదరాబాద్-విజయవాడ రస్తా బంద్.. 10 కి.మీ. ట్రాఫిక్ జామ్  

సంక్రాంతికి ఇళ్లముందర చుక్కల ముగ్గులు వేసినట్లు.. రోడ్లపై వాహనాలు ఆగిపోయి ముగ్గులు వేసుకున్నాయి. గజిబిజిగా గుమిగూడి తప్పించుకోలేక పద్మవ్యూహంలో చిక్కుకున్నాయి. రద్దీకి తోడు, పొగమంచు కూడా దాడి చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. హైదరాబాద్ విజయవాడ హైవేపై ఏకంగా 10 కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. దీంత పండగ ప్రయాణికులు నరకయాతన పడుతున్నాయి. టోల్ గేట్ల వద్ద గంటల తరబడి జామ్ అవుతోంది. దీంతో అసలు పండగకన్నా ఇంటికి చేరుకుంటామా? లేకపోతే టోల్ గేట్ల వద్దే ముగ్గులు వేసుకుని పండగ చేసుకోవాలా? అని జనం ఆందోళనచెంతున్నారు.



నల్గొండ జిల్లా పంతంగి టోల్ గేట్ వద్ద భారీ సంఖ్యలో వాహనాలు ఆగాయి.  తెల్లవారుజామున 10 కి.మీ మేర జామ్ ఏర్పడింది. రోజూ 15 వేల వాహనాలు వెళ్తే దారిలో ఏకంగా అర లక్ష పండగ వాహనాలు రావడంతో పరిస్థితి చేయిదాటి పోయింది. అన్ని వాహనాలకు టికెట్లివ్వాల్సి రావడంతో టోల్ సిబ్బందికి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది.

పంతంగి టోల్ వద్ద 16 గేట్లు ఉండగా, సాధారణ రోజుల్లో ఐదారు గేట్లే తెరుస్తారు. పండగ కావడంతో మొత్తం గేట్లన్నీ తెరుచుకున్నాయి. 10గేట్లను హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే బండ్ల కోసం తెరిచారు.  మిగతా వాటిని విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే బండ్లకు కేటాయించారు. శనివారం, ఆదివారం మరింత రద్దీ ఏర్పాడుతుందని, దీనిపై ఎలా స్పందించాలో తమకు అర్థం కావడం లేదని రవాణా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టోల్ ఫీజును రద్దు చేయాలన్న ఆలోచన ఉన్నా అది సాధ్యం కాదని అంటున్నారు.Telugu news Hyderabad-Vijayawada highway busy with vehicles on Sankranti season pantangi toll plaza witness 10 km traffic jam