హైదరాబాద్‌లో వేలాడే వంతెన...త్వరలో! - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో వేలాడే వంతెన…త్వరలో!

February 23, 2018

ఆకాశ మార్గంలో మూసీ నదిపై విహరిస్తూ, కబుర్లతో కాలక్షేపం చేస్తూ, షాపింగ్ చేస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించుకోండి?నిజమైతే  బాగుండు అనిపిస్తోంది కదా ! త్వరలో ఈ ఊహనే జీహెచ్ఎంసీ నిజం చేయనుంది. ఢిల్లీలోని 10జనపథ్ తరహాలోనే పాదచారులకు  మూసీనదిపై వేలాడే వంతెనను నిర్మించనున్నారు.

చార్మినార్ అభివృద్ది ప్రాజెక్ట్ (సీపీపీ) భాగంగా పాతబస్తీ కేంద్రంగా ఈ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు.మూసీకి ఇరువైపులా ఉన్న సాలార్జింగ్ మ్యూజియం నుంచి రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం వరకు వేలాడే వంతెన (ఓవర్‌ హ్యాంగింగ్‌ బ్రిడ్జి) నిర్మించాలని నిర్ణయించారు. దాదాపు 400 మీటర్ల మేర నిర్మించే ఈ వంతెనకు రూ.50 కోట్లు వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు.

 

అలాగే చార్మినార్‌ రహదారులపై ఉండే వీధి వ్యాపారులను అక్కడి నుంచి మరొక ప్రాంతానికి తరలించేందుకు కసరత్తు జరుగుతోంది. 190 మంది వ్యాపారులు ఉన్నట్టు గుర్తించిన జీహెచ్‌ఎంసీ వారికి పునరావాసం కల్పించే అంశాన్ని పరిశీలిస్తోంది. సీపీపీలో భాగంగా గ్రానైట్‌ పేవ్‌మెంట్‌ నిర్మిస్తుండగా, వాటి పైనా తోపుడు బండ్లతో వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇది పర్యాటకులకు  చాలా ఇబ్బందిగా మారింది. దాంతో వీటిని తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. శాలిబండ, ఖిల్వత్‌లో మల్టీలెవల్‌ పార్కింగ్‌ కాంప్లెక్సులు నిర్మించాలని భావిస్తున్న సంస్థ ఆ భవనాల్లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌ల్లో వీధి వ్యాపారులకు షాపులను కేటాయించనుంది. మూడు సెల్లార్‌లు, పైన మూడంతస్తులు పార్కింగ్‌కు వినియోగిస్తారు.