జబర్దస్త్ ఆది క్షమాపణ చెప్పాలి:  మా ఇల్లు - MicTv.in - Telugu News
mictv telugu

జబర్దస్త్ ఆది క్షమాపణ చెప్పాలి:  మా ఇల్లు

November 24, 2017

జబర్దస్త్ కామెడీషోలో హైపర్ ఆది అనాథ పిల్లలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతని వ్యాఖ్యాలు అమానవీయంగా ఉన్నాయని, జబర్దస్త్ కామెడీ షో బాధ్యులు, ఆది క్షమాపణ చెప్పాలని ‘మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమం’ అనే ఎన్జీవో డిమాండ్ చేసింది. ఈమేరకు ఓ ప్రకటనలో డిమాండ్ చేసింది.‘నిన్నటి ‘జబర్దస్త్’ కామెడీ షోలో అనాథశరణాలయం అనే బోర్డు పెట్టి అవహేళన చేస్తూ, అపహాస్యం చేస్తూ ఆశ్రమాలను ఈ విధంగా కామెడీలకు వాడుకోవడం ఏ మాత్రం సరైనది కాదు. ఈ సమాజం పట్ల బాధ్యత  కలిగిన మీడియానే అనాథలను ఇంత ఘోరంగా అవగాహన రాహిత్యంతోటి చిత్రీకరించిన సందర్భాలు ఉండకపోవచ్చు. ఈ జబర్దస్త్ షో చూసిన తరువాత అసలు ఈటీవీ చానల్ వారికి  అనాథలంటే ఎవరో తెలుసా అనిపిస్తోంది…  ఇప్పటికైనా నేర్చుకోండి. అ – అంటే అమ్మ, నా – అంటే నాన్న, ద – అంటే దగ్గర పెరగనటువంటి ఈ పిల్లల సంరక్షణ చూసుకోవలసిన భాద్యత ఈ సమాజానిది. అనాథల గురించి ఉపయోగించిన భాష, చిత్రీకరించిన విధానం మానవత్వం ఉన్న ప్రజాస్వామ్య విలువలు కలిగిన వారు చేసే పని కాదు. ఇటువంటి పద్ధతిని, విధానాలను వెంటనే ఉపసంహరించుకుంటూ చేసిన తప్పుకు..  విచక్షణ ఉంటే ఈ షోకు బాధ్యులైన వారు, హైపర్ ఆది వెంటనే  బహిరంగ క్షమాపణ చెప్పాలని ‘మాఇల్లు ప్రజాదరణ ఆశ్రమం’ వాళ్లం డిమాండ్ చేస్తున్నాం.’.