అనాథలకు హైపర్ ఆది బూతునీచ నిర్వచనం.. మీరు సమర్థిస్తారా? - MicTv.in - Telugu News
mictv telugu

అనాథలకు హైపర్ ఆది బూతునీచ నిర్వచనం.. మీరు సమర్థిస్తారా?

November 24, 2017

‘అతిగా ఆవేశపడే ఆడదానికి, అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతానాన్నే అనాథలు అంటారు’.. ఇది జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆది అనాథల గురించి అన్నమాట. దీనికి జడ్జిలుగా ఉన్న నాగబాబు, రోజాలు పగలబడి నవ్వడం. ఇంతకంటే దిగజారుడు తనం ఇంకోటుండదు. అమ్మ నాన్నలు లేక, వాళ్ల ప్రేమకు నోచుకోని పిల్లలు ఎంత కృంగిపోయి ఉంటారో వీళ్లకేం తెలుసు. ఓసారి అనాథాశ్రమానికి వెళ్లి వాళ్ల మానసిక స్థితి చూస్తే ఇలాంటి వాళ్లకు బుద్దస్తుందేమో.  తమని కన్నవారెవరో తెలియని అభాగ్యులు, ప్రమాదాల్లో తల్లి దండ్రులను పొగొట్టుకున్న వాళ్లు, సంసారాన్ని సర్దుబాటు చేసుకోని తల్లిదండ్రులు విడిచిపెట్టిన పిల్లలు..ఇలాంటి వారెందరో అనాథలే.మరి హైపర్ ఆది  అన్నట్టు  ఈ పిల్లలందరిలో  తమ తల్లిదండ్రుల గురించి  అలాంటి భావనే వస్తే, వారి మానసిక పరిస్థితి ఎలా తయారవుతుంది. అభం శుభం ఎరుగని అనాథల మీదా.. మీ వెకిలి పంచులు, డబుల్ మీనింగ్ డైలాగులు. ఛీఛీ.. నీచమనే మాట కూడా వీళ్ల నీచమైన డైలాగులను విని సిగ్గుపడుతుందేమో. కేవలం బూతులనే పంచులుగా రాసుకొని అదే హాస్యం అంటూ  వెకిలి వేషాలు వేస్తూ  అందరూ నవ్వుతున్నారు అని అనుకోవడం ఇలాంటి వాళ్ల దిగజారుడు తనానికి నిదర్శనం.  పెళ్లాంతో మొదలు పెడితే, పిల్లలు, వృద్ధులు అందరినీ  బూతు పంచులతో కామెంట్లు చేస్తే  తప్ప కామెడీ పండదా? బూతు లేని పంచ్ లేస్తే జనాలు చూడరా? మన దౌర్భాగ్యం ఏంటంటే ఇలాంటి వాటికే లక్షల వ్యూస్ రావడం, ఎక్కువ రేటింగ్ రావడం.

సమాజంలో ఉన్న  అమ్మ, అక్క, చెల్లి పెళ్లాం, పిల్లలు ఇలా అన్ని వర్గాల వారిపై బూతులతో పంచులు వేస్తున్న వారిని ప్రోత్సహించి  సెలబ్రిటీలుగా పాపులర్ చెయ్యడం నిజంగా ఇది మన దౌర్భాగ్యమే. ఇలాంటి నీచ, నికృష్ట వెకిలి చేష్టల కామెడీకి  చరమగీతం పాడకపోతే  చివరకు పెళ్లాం పిల్లల మీదే కాదు, నవమాసాలు మోసిన తల్లి మీద కూడా బూతు పంచులు వేసే  స్థాయికి  సమాజం దిగజారుతుందనే దానిలో ఎటువంటి సందేహం లేదు.

ఆది బూతు పంచుల గురించి నెటిజన్ల అభిప్రాయాలు

ఆదీ.. ఆ జబర్దస్తును వీడి బయటకు రా.. పాలె నిషా ( నర్సు )

మనిషి ప్రాణం ఎప్పుడుంటుందో.. ఎప్పుడు పోతుందో తెల్వది.. అలాంటి వాళ్ళకు పుట్టిన పిల్లల గురించి జబర్దస్త్ షోలో ఆది కామెంట్ చేయటం సరికాదు. అనాథల గురించి ఆది తన స్కిట్‌లో సటైర్ వెయ్యటం అత్యంత బాధాకరమైన విషయం. అతను జబర్దస్త్ స్టేజీ ఎక్కి చాలా మందిని టార్గెట్ చేస్తున్నాడు. ఇలాంటి పిచ్చి చేష్టలను తగ్గించుకుంటే మంచిది. పాపం ఎంతో మంది అభం శుభం తెలియని అనాధలు బిక్కు బిక్కు మంటున్నారు. ఇతని ప్రేలాపనలను వాళ్ళు నిజమే అనుకుంటే పాపం అనాధల తల్లిదండ్రులు వారి దృష్ఠిలో ప్రతినాయకులుగా మిగిలిపోతారు కదా. ఆదీ.. నువ్వొక్కసారి ఆ జబర్దస్త్ షోను వీడి జనాల్లోకి రా.. అప్పుడు ఏ పాపం తెలీని పబ్లిక్ మీద సటైర్లు వెయ్యటం ఎలాగో తెలుస్తుంది.